దేశీయ ఆటగాళ్లు ఎవరైనా వారి వయసు విషయంలో మోసం చేస్తుంటే స్వచ్ఛందంగా ఒప్పుకోవాలని బీసీసీఐ సూచించింది. అలా చేసిన వారిని క్షమించేస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ నిబంధన ఉల్లంఘించినట్లు తేలితే, రెండేళ్లు సస్పెండ్ చేయనున్నట్లు హెచ్చరించింది. 2020-21 సీజన్ నుంచి బోర్డు గ్రూప్ టోర్నీలో పాల్గొనే క్రికెటర్లందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది.
"పుట్టిన తేదీకి సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించిన దేశీయ క్రికెటర్లు.. స్వచ్ఛందంగా ఒప్పుకుంటే ఎలాంటి శిక్ష విధించం. పుట్టిన తేదీని వెల్లడిస్తేనే గ్రూప్ లెవల్ టోర్నీలో పాల్గొనేందుకు అనుమతిస్తాం. ఇందుకోసం సంతకం చేసిన లేఖ/ మెయిల్‌తో పాటు ధ్రువపత్రాలను బీసీసీఐ ఏజ్ వెరిఫికేషన్ డిపార్ట్మెంట్కు సమర్పించాలి. వీటిని సెప్టెంబరు 15లోపు వెల్లడించాల్సి ఉంటుంది"
బీసీసీఐ ప్రకటన
ఆటగాళ్లు తమ తప్పును అంగీకరించకపోతే.. భవిష్యత్తులో బాధపడాల్సి ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. శాశ్వత నివాసాల విషయంలో మోసానికి పాల్పడిన ఆటగాళ్లకూ రెండేళ్ల బహిష్కరణతో పాటు, స్వచ్ఛంద బహిర్గత పథకం వర్తించదని బీసీసీఐ వివరించింది. సీనియర్ క్రికెటర్లకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
మోసాలకు పాల్పడుతున్న అండర్ 19 ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. వీటికి అరికట్టే దిశగా 24 గంటల హెల్ప్‌లైన్ నంబర్(9820556566/9136694499)ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది.