గంగూలీ అధ్యక్షతన ఏర్పాటైన బీసీసీఐ కార్యవర్గం అప్పుడే తన మార్క్ చూపిస్తోంది. బీసీసీఐపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) పెత్తనం సహించేది లేదని పరోక్షంగా ఇప్పటికే వెళ్లడించగా.. తాజాగా ఓ కీలక నిర్ణయానికి ముందడుగు వేసింది దాదా బృందం.
ఐసీసీ వైఖరి ఇదీ...
ఐసీసీకి అత్యధిక ఆదాయం భారత్ నుంచే వస్తోంది. ఆదాయంలో మాత్రమే కాదు క్రికెట్ ఆదరణ విషయంలోనూ భారత్‌దే కీలకపాత్ర. కానీ కొంతకాలంగా బీసీసీఐని ఐసీసీ గౌరవించట్లేదు. తాజాగా వర్కింగ్ గ్రూప్‌లోనూ బీసీసీఐ ప్రతినిధులకు చోటు దక్కలేదు. బిగ్ త్రీ మోడల్ (ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, భారత్)ను ఐసీసీ రద్దు చేసి.. కొత్త రెవెన్యూ పద్ధతి అవలంభిస్తోంది. దీని వల్ల భారీగా ఆదాయం కోల్పోతోంది బీసీసీఐ.
ఏమైంది..?
పాలన మొత్తం సుప్రీం కోర్టు నియమిత కమిటీ చేతుల్లోకి వెళ్లి బీసీసీఐ బలహీనపడ్డ సమయంలో ఐసీసీ.. భారత్ ప్రయోజనాలకు విరుద్ధంగా అనేక నిర్ణయాలు తీసుకుంది. భారత బోర్డు ఆదాయంలోనూ కోత విధించింది. అయినా ఐసీసీని నిలదీసే వారు లేకపోయారు. కానీ ఇప్పుడు బీసీసీఐని నడిపిస్తున్న సౌరభ్ గంగూలీ ఐసీసీతో అమీతుమీకి సిద్ధమయ్యాడు. బీసీసీఐ ఆదాయంలో రూ.165 కోట్లు కోత పెట్టిన ఐసీసీపై... న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించింది గంగూలీ నేతృత్వంలోని కార్యవర్గం.
భారత్ ఆతిథ్యమిచ్చిన 2016 టీ20 ప్రపంచకప్ సందర్భంగా ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు ఇప్పిస్తామన్న హామీని నిలబెట్టుకోలేకపోయినందుకు.. బోర్డుకు రావాల్సిన ఆదాయం నుంచి 23 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.165 కోట్లు) ఐసీసీ కోత పెట్టింది. అయితే తమ పరిధిలో లేని విషయాన్ని కారణంగా చూపి ఇలా ఆదాయంలో కోత వేయడం తగదని బీసీసీఐ వాదించినా ఐసీసీ వినిపించుకోలేదు. ఈ వ్యవహారంలో ఐసీసీపై పోరాటానికి కొత్త కార్యవర్గం నిర్ణయించుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌పై న్యాయపోరాటం చేసేందుకు దుబాయ్‌కి చెందిన హెర్బర్ట్ స్మిత్ ఫ్రీహిల్స్ సంస్థను నియమించుకుంది.