భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు.. బీసీసీఐ నుంచి ఊహించని ఆదేశం వచ్చింది. రంజీల్లో బంగాల్ తరఫున బరిలోకి దిగుతున్న ఈ క్రికెటర్‌కు.. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన గులాబీ టెస్టులో వేలికి గాయమైంది. ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం కోలుకున్న ఈ సీనియర్ క్రికెటర్ త్వరలో దిల్లీతో జరగనున్న రంజీ మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. కానీ భారత బోర్డు అతడికి ఊహించని షాకిచ్చింది.
కారణం ఇదేనా..!
న్యూజిలాండ్‌తో ఫిబ్రవరి 21 నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది కోహ్లీసేన. ఇందులో ప్రధాన కీపర్‌గా సాహాను ఎంపిక చేయనున్నారు. సాహా గాయపడితే ప్రత్యామ్నాయంగా ఉండే పంత్‌కు విదేశీ పిచ్‌లపై సరైన అవగాహన లేదు. ఫలితంగా సాహాపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు సెలక్టర్లు. ఇప్పటికే ధావన్, ఇషాంత్ వంటి సీనియర్లు కూడా గాయాలపాలయ్యారు. ఫలితంగా టోర్నీకి దూరమయ్యారు. ఈ సందర్భంగా సాహాను జాగ్రత్త వహించమని.. వీలైతే మ్యాచ్‌ల్లో ఆడొద్దని బీసీసీఐ సూచించినట్లు తెలుస్తోంది.

బ్యాకప్ పైనా...
ప్రస్తుతం కేఎల్ రాహుల్ టీ20, వన్డే జట్టుల్లో అంతర్భాగం అయ్యాడు. ప్రపంచకప్ నుంచి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ యువ కీపర్ పంత్ స్థానంలో అదరగొట్టాడు. ఒకవేళ సాహా ఎంపికైతే పంత్ లేదా రాహుల్ బ్యాకప్ కీపర్లుగా ఉపయోగపడనున్నారు.
జనవరి 24 నుంచి న్యూజిలాండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల్ని ఆడనుంది టీమిండియా. ఈ మేరకు ఇప్పటికే టీ20, వన్డే జట్లని భారత సెలక్టర్లు ప్రకటించారు. శిఖర్ ధావన్ స్థానంలో టీ20లకు సంజు శాంసన్ ఎంపికవగా.. వన్డేల్లో పృథ్వీ షా చోటు దక్కించుకున్నాడు.