భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగబోయే రెండో టెస్టుకు ఎస్జీ సంస్థ తయారు చేసిన గులాబి బంతితోనే ఆడేందుకు రంగం సిద్ధమవుతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు గంగూలీ సూచనల మేరకు తయారీ సంస్థకు 72 బంతులు ఆర్డర్ ఇచ్చింది బోర్డు.
" కోల్‌కతాలో ఎస్జీ బంతులతోనే డే/నైట్ మ్యాచ్ నిర్వహిస్తాం. తొలి టెస్టులో ఎస్జీ తయారు చేసిన ఎర్ర బంతితోనే ఆడతారు. కాబట్టి రెండో టెస్టులోనూ అదే సంస్థ బంతిని ఉపయోగిస్తాం. డ్యూక్స్ లేదా కుకాబుర్రా బంతితో మ్యాచ్ సాధ్యం కాదు".
-- గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
గతంలో కోహ్లీ విమర్శలు...
ఎస్జీ సంస్థకు గులాబి బంతులు పెద్ద ఛాలెంజ్‌గా మారనున్నాయి. ఇప్పటి వరకు దులీప్ ట్రోఫీలోని మూడు సీజన్లకు కుకాబుర్రా బంతులనే వాడారు. అయితే ఈ ఏడాది నుంచే ఎస్జీ సంస్థ తయారుచేసిన ఎర్ర బంతులతో మ్యాచ్‌లు ఆడుతున్నారు.
ఎస్జీ సంస్థ అందిస్తోన్న ఎర్ర బంతులపై కోహ్లీ గతంలో విమర్శలు చేశాడు. డ్యూక్, కుకాబుర్రా బంతులతో పోలిస్తే ఈ సంస్థ ఎరుపు రంగు బంతులు అంత నాణ్యతగా లేవని అభిప్రాయం వ్యక్తం చేశాడు. 60 ఓవర్ల వరకు బంతి చెక్కుచెదరకుండా ఉండేలా తయారుచేయాలని కోహ్లీ.. అప్పట్లో వారిని కోరాడు.
2017 నుంచే గులాబి బంతిపై లోపాలను తెలుసుకొని, వాటిని పరిష్కరించామని, నాణ్యతలో రాజీలేకుండా బంతులను అందించేందుకు.. ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని ఎస్జీ సంస్థ అధికారులు చెప్పారు. భారత బోర్డుకు వారం రోజుల్లోనే ఈ కొత్త బంతులను అందజేస్తామని వెల్లడించారు.
"ఎరుపు రంగు బంతితో పోలిస్తే గులాబి బంతికి ఎక్కువగా ధూళి అంటుకుంటుంది. అంతేకాకుండా త్వరగా మాసిపోతుంది. అందువల్లే బంతి కనబడక ఇబ్బందులు ఎదురయ్యాయి"అని గులాబి బంతి లోపాలను వెల్లడించారు తయారీదారులు.
టికెట్ రేటు చాలా తక్కువ...
నవంబర్ 22 నుంచి 26 వరకు డే/నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు టికెట్ ధరలు రూ.50 నుంచే ప్రారంభం కానున్నాయి. రోజువారీగా టికెట్ల ధరలను రూ.50, 100, 150గా నిర్ణయిస్తామని, ఫలితంగా అత్యధిక మంది ప్రేక్షకులను స్టేడియానికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు బంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) కార్యదర్శి అభిషేక్ దాల్మియా.
సాధారణ డే/నైట్ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2:30 నుంచి మొదలవుతాయి. కానీ మంచు ప్రభావం వల్ల ఈ మ్యాచ్‌ను ఒక గంట ముందే ప్రారంభించి.. రాత్రి 8:30 కల్లా పూర్తయ్యేలా బీసీసీఐని అనుమతి కోరుతున్నామని చెప్పారు అభిషేక్. 68 వేల మంది కూర్చునే సామర్థ్యం ఈ స్టేడియం సొంతమని అన్నారు. సాధారణ టెస్టు మ్యాచ్‌ల్లాగే తొలి సెషన్‌లో 20 నిమిషాల టీ బ్రేక్‌తో పాటు 40 నిమిషాల భోజన విరామం ఉంటుందన్నారు. ఫలితంగా ఒకటిన్నర సెషన్లు ఫ్లడ్ లైట్ల కిందే మ్యాచ్ జరుగుతుందని స్పష్టం చేశారు.
బీసీసీఐ నుంచి మ్యాచ్ నిర్వహణ సమయంపై స్పష్టత రాగానే టికెట్ల ముద్రణ ప్రక్రియ ప్రారంభించనున్నట్టు చెప్పారు అభిషేక్. పాఠశాల విద్యార్థులు మ్యాచ్ వీక్షించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటామని అన్నారు.