సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, సభ్యుడు గగన్ ఖోడా స్థానంలో కొత్త సెలక్టర్ల కోసం బీసీసీఐ.. శనివారం దరఖాస్తులు ఆహ్వానించింది. ఎంపికకు సంబంధించిన నిబంధనలు ఖరారు చేసింది. సీనియర్లతో పాటు మహిళల సెలక్షన్ కమిటీని బోర్డు పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. జూనియర్ కమిటీలో మాత్రం రెండు మార్పులు చేస్తోంది. దరఖాస్తు చేసుకొనేందుకు ఈనెల 24ను చివరి తేదీగా ప్రకటించింది.
![MSK PRASAD SELCTION COMMITTE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/msk-prasad-1549895346_0112newsroom_1575207798_0.jpg)
ఆసక్తిగల అభ్యర్థులను క్రికెట్ సలహా సంఘం (సీఏసీ) ముఖాముఖి చేస్తుంది. ఇంతకు ముందు ప్రతిపాదించినట్టుగా మదన్ లాల్, గౌతమ్ గంభీర్, సులక్షణ నాయక్ ఇందులో సభ్యులుగా ఉంటారో లేదో ఇంకా స్పష్టత రాలేదు. బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం ఎంపికకు నిబంధనలు రూపొందించారు. అర్హత వయసు 60కి కుదించారు. ఈ కారణంగా ఆశావహుల్లో ముందున్న దిలీప్ వెంగ్‌సర్కార్ (64) అవకాశం కోల్పోయినట్టే.
ఇవీ నిబంధనలు
- సీనియర్ సెలక్షన్ కమిటీ అభ్యర్థులకు వయసు 60 లోపు ఉండాలి.
- అభ్యర్థి కనీసం 7 టెస్టులు/30 ఫస్ట్‌క్లాస్ మ్యాచులు ఆడి ఉండాలి. లేదంటే 10 వన్డేలు/20 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల అనుభవం అవసరం.
- అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐదు సంవత్సరాలైనా ఉండాలి.
- జూనియర్ సెలక్షన్ కమిటీ అభ్యర్థులకు 25 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల అనుభవం అవసరం.
- మహిళల సెలక్షన్ కమిటీకైతే అభ్యర్థులు టీమిండియా తరఫున కనీసం ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడినా సరి.