ఏ చిత్రసీమలో చూసినా ప్రస్తుతం బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. తక్కువ బడ్జెట్‌తో రూపొందించడం వల్ల నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నాయి. క్రికెట్ నేపథ్యంలో వరుసగా సినిమాలు తీస్తున్నారు. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ జీవిత చరిత్రలో నటిస్తున్నట్లు హీరోయిన్ తాప్సీ ఇటీవలే ప్రకటించింది. భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ బయోపిక్.. త్వరలో ప్రారంభం కానుందని సమాచారం.
దాదా ఇష్టమైన నటుడు...
ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న గంగూలీకి ఓ ప్రశ్న ఎదురైంది. " ఒకవేళ మీ బయోపిక్ తీస్తే.. అందులో ఏ హీరో టైటిల్ పాత్ర పోషించాలనుకుంటున్నారు" అని అడిగారు. "హృతిక్ రోషన్. నేను అతడి నటనను ఎక్కువగా ఇష్టపడతా" అని వెంటనే సమాధానం ఇచ్చాడు దాదా.
ఒకవేళ దాదా బయోపిక్ వస్తే.. అతడి కోరిక మేరకు దర్శకనిర్మాతలు హృతిక్ రోషన్‌ను తీసుకుంటారో లేదో చూడాలి. హీరో హృతిక్.. భారతీయ సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నాడు. నటనతోనే కాకుండా డ్యాన్స్‌తోనూ అభిమానులను అలరిస్తుంటాడు. ఈ ఏడాది 'సూపర్ 30', 'వార్' చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు.
పేరొచ్చింది...
ఇప్పటికే భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెందూల్కర్, ఎంఎస్ ధోనీలపై వచ్చిన బయోపిక్‌లు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. మేరీకోమ్, భాగ్ మిల్కా భాగ్, దంగల్ లాంటి క్రీడా నేపథ్య చిత్రాలనూ అభిమానులు ఆదరించారు.
ఇప్పటికే గంగూలీ పాత్రతో ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఇందులో దాదా పాత్ర తక్కువ నిడివితో ఉండనుంది. 2002లో లార్డ్స్ మైదానంలో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయోత్సవంలో భాగంగా సౌరభ్ గంగూలీ.. చొక్కా విప్పి విజయ నినాదం చేశాడు. ఈ సంఘటన ఆధారంగా 'దూస్రా' అనే సినిమా తీస్తున్నారు. అభినయ్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు.