క్రికెట్ సంస్కరణల విషయంలో రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ దరఖాస్తులను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. కానీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా, ఉమ్మడి కార్యదర్శి జయేశ్ జార్జ్ల బృందాన్ని బోర్డులో కొనసాగింపుపై వచ్చే ఏడాదికి తీర్పు వాయిదా పడింది.
సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ రూపొందించిన క్రికెట్ రాజ్యాంగంలో కీలకమైన సవరణలు కోరుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అత్యున్నత న్యాయస్థానంలో దరఖాస్తు చేసింది. అయితే దీనికి సంబంధించిన తదుపరి వాదనలను జనవరి మూడో వారంలో సవరణల జాబితాను చర్చించాలని కోర్టు బుధవారం కోరింది.
"వివిధ రాష్ట్రాల క్రికెట్ బోర్డుల నుంచి వచ్చిన అనేక దరఖాస్తులను కోర్టు బుధవారం విచారించింది. ఇందులో నిధుల దుర్వినియోగం కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కొన్ని కేసులు మాత్రమే మిగిలున్నాయి. జనవరి మూడో వారంలో వీటిని జాబితా చేయమని కోర్టు కోరింది. క్రికెట్ రాజ్యాంగ సవరణలను కోరుతూ బీసీసీఐ చేసిన దరఖాస్తును కోర్టు బుధవారం స్వీకరించలేదు." అని కోర్టు వాదనల అనంతరం రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ల మధ్యవర్తి నరసింహ ఈ విధంగా తెలిపారు.
జనవరి వరకు అదే పదవిలో
దీంతో సౌరవ్ గంగూలీ, అతని బృందం.. 2021 వరకు అవే పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది. వీరి పదవీకాలం కొన్ని నెలల క్రితమే పూర్తయింది. డిసెంబరు 24న జరగనున్న బీసీసీఐ సాధారణ వార్షిక సమావేశంలో జై షా, జార్జ్‌లతో పాటు గంగూలీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.
గరిష్ఠంగా ఆరేళ్లు
కొత్త బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఆఫీస్-బేరర్లైన.. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, కోశాధికారులు వరుసగా ఆరేళ్ల పాటు పదవీకాలాలు పూర్తి చేసుకున్న తర్వాత మూడేళ్ల పాటు కూలింగ్ ఆఫ్ పీరియడ్‌లోకి వెళ్తారు. అయితే ఇది నిబంధన బీసీసీఐతో పాటు రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు వర్తిస్తుంది.
మూడేళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ తర్వాత తిరిగి పదవి చేపట్టడానికి అర్హులు. లోధా కమిటీ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి బీసీసీఐలో గరిష్ఠంగా తొమ్మిదేళ్లు, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో మరో తొమ్మిదేళ్లు ఆఫీసు-బేరర్‌గా పనిచేయొచ్చు. కొత్త రాజ్యాంగంలోని ఏడు కీలకమైన నియమాల మార్పులలో ఇదొకటి. ఇది సవరిస్తే ప్రస్తుత ఆఫీసు-బేరర్లను కొనసాగించడానికి అనుమతిస్తుంది.
ముగిసిన పదవీకాలం
గతేడాది అక్టోబరు 23న గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. ఆ పదవిలో 278 రోజులు మాత్రమే కొనసాగాల్సి ఉంది. ఎందుకంటే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బంగాల్ (సీఏబీ)లో 2014లో కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆ పదవీకాలాన్ని బీసీసీఐ అధ్యక్ష పదవికి చేర్చగా.. ఈ ఏడాది జులై 26తో అతని పదవీకాలం పూర్తయ్యింది.
కొన్ని వార్తాపత్రికల నివేదికల ద్వారా బీసీసీఐ కార్యదర్శి జై షా.. 2013 సెప్టెంబరు 8న గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. దీంతో పాటు బీసీసీఐ పదవీకాలంతో సంబంధం ఉన్న కారణంగా.. జై షా పదవీకాలం కూడా కొన్ని నెలల క్రితమే పూర్తయ్యింది.
మరోవైపు జార్జ్ ఐదేళ్ల పాటు కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) కార్యదర్శిగా, జాయింట్ సెక్రటరీగా, కోశాధికారిగా పనిచేశారు. దీంతో పాటు బీసీసీఐ జాయింట్ సెక్రటరీగా ఏడాది పూర్తి చేశాడు. కేసీఏ ఎన్నికల సమయమైన గతేడాది సెప్టెంబరులో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జార్జ్.."నేను 2013 జూన్ 21 నుంచి 2018 జులై వరకు ఆఫీసు-బేరర్‌గా ఉన్నాను. ఆరేళ్లు పూర్తి చేయడానికి నాకు ఇంకా 11 నెలల సమయం ఉంది" అని అన్నాడు. ఇప్పటికే అతడి పదవీకాలం ముగిసింది.
2018 జులై 7 నుంచి 2019 సెప్టెంబరు 14 మధ్య ఏ పదవిలో కొనసాగలేదు. ఆ తర్వాత 2019 సెప్టెంబరు 15న అతను కేసీఏ అధ్యక్షడయ్యాడు. 2019 అక్టోబరు 23న బీసీసీఐ జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన తర్వాత ఆ పదవిని వదులుకున్నాడు. అంటే అతడి విరామ సమయాన్ని మినహాయిస్తే క్రికెట్ నిర్వాహకుడిగా అతడి ఆరేళ్ల పదవీకాలం పూర్తి అయ్యినట్లే. దీని ప్రకారం సెప్టెంబరు 14 నుంచి అతను కూలింప్ ఆఫ్ పీరియడ్‌లోకి వెళ్లాలి.