వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌కు భారత్‌లో ఆతిథ్యం ఇవ్వడం, దేశవాళీ క్రికెట్ తిరిగి ఆరంభించడం వంటి నిర్ణయాలపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్.. ఈ నెల 17న ఆన్‌లైన్ సమావేశం నిర్వహించనుంది. మహమ్మారి కరోనా కారణంగా దేశంలో క్రికెట్ నిలిచిపోయింది. అయితే బయో బుడగ ఏర్పాటు చేసి దేశవాళీ క్రికెట్‌ను తిరిగి ఆరంభించాలని బీసీసీఐ భావిస్తోంది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 19 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభం కావాల్సి ఉంది.
అలాగే యూఏఈలో లీగ్ నిర్వహిస్తున్న తరహాలోనే ముంబయి వేదికగా బయో బుడగ ఏర్పాటు చేసి ఇంగ్లాండ్ సిరీస్‌ను దేశంలోనే నిర్వహించాలనే యోచనలో బీసీసీఐ ఉంది. యూఏఈలో మూడు స్టేడియాలు మాదిరిగానే ముంబయిలోనూ మూడు మైదానాలు ఉన్నాయని, బయో బుడగను ఇండియాలోనూ నిర్వహించవచ్చని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ గతంలో పేర్కొన్నాడు. ముంబయిలో సీసీఐ, వాంఖడే, డీవై పాటిల్ స్టేడియాలు ఉన్నాయి. కాగా, వచ్చే ఏడాది జనవరి-మార్చి మధ్యలో ఇంగ్లాండ్‌తో కోహ్లీసేన అయిదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే భారత్‌లో నిర్వహించడం కుదరకపోతే యూఏఈ వేదికగానే ఇంగ్లాండ్‌కు ఆతిథ్యం ఇవ్వాలని బోర్డు ఆలోచిస్తోంది. అంతేకాక లీగ్ అనంతరం టీమిండియా పాల్గొనే ఆస్ట్రేలియా పర్యటనపై కూడా సమావేశంలో చర్చించనుంది.