ఐపీఎల్ ప్రిపరేషన్ ఆలస్యం కావడానికి కారణం ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారి ఒకరు ఆరోపించారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను జరపడం కష్టమని క్రికెట్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఎడ్డింగ్స్ చెప్పిన సరే, దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ ఎందుకు జాప్యం చేస్తోందని అన్నారు.
"పదవీకాలం ముగిసిన ఐసీసీ అధ్యక్షుడు ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారు. ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ జరపలేమని చెబుతున్నా సరే దానిపై నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు కాలయాపన చేస్తున్నారు. బీసీసీఐతో ఆడుకుంటున్నారా?" అని ఓ అధికారి అన్నారు.
అక్టోబరు 18-నవంబరు 15 మధ్య టీ20 ప్రపంచకప్ నిర్వహణ విషయమై ఈనెల 10న ఐసీసీ భేటీ జరిగింది. కానీ దానిపై నిర్ణయాన్ని జులైకి వాయిదా వేశారు. అయితే టోర్నీపై త్వరగా స్పష్టతనివ్వాలని బీసీసీఐ అధికారి కోరారు. ఇది బీసీసీఐ లేదంటే ఐపీఎల్ కోసమో కాదని వివిధ దేశాల క్రికెట్ బోర్డులు ద్వైపాక్షిక సిరీస్‌లు కోసమని అన్నారు. లేకపోతే అందరికి సమయం వృథా అవుతుందని చెప్పారు.
భారత్‌లో కుదరకపోతే ఐపీఎల్‌ను శ్రీలంక, యూఏఈలో నిర్వహించాలని వస్తున్న ప్రతిపాదనలపై బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పందించారు. "అన్ని విధాలుగా పరిశీలించి మా ఆటగాళ్లు ఎక్కడ సురక్షితమని భావిస్తే అక్కడ నిర్వహిస్తాం" అని చెప్పారు. ఐపీఎల్ నిర్వహణ భారత్‌లో కుదరకపోతే శ్రీలంక, యూఏఈలో జరపాలని దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: