ఇప్పటికే నిషేధం కారణంగా గతేడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్. ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కి ఆగ్రహం తెప్పించడం ద్వారా మరోసారి అతడి ఐపీఎల్ ఆశలకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది. తాను బంగ్లా జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా ఐపీఎల్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు బంగ్లా బోర్డు తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తోందంటూ షకిబ్ చేసిన వ్యాఖ్యలు బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ ఛైర్మన్ అక్రమ్ ఖాన్‌కు ఆగ్రహం తెప్పించాయి.
ఫలితంగా షకిబ్ ఐపీఎల్‌లో ఆడేందుకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేసే విషయంలో పునరాలోచించనున్నట్లు అక్రమ్ సంకేతాలు ఇచ్చాడు. "బంగ్లా తరఫున టెస్టులు ఆడే విషయమై షకిబ్ రాసిన లేఖను నేను చదవనే లేదంటూ అతనన్నట్లు విన్నా. షకిబ్‌కు ఆసక్తి ఉంటే శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్ ఆడతాడు. కానీ అతను తాను ఈ టెస్టు సిరీస్ బదులు ఐపీఎల్ ఆడాలనుకుంటున్నట్లు స్పష్టంగా చెప్పాడు. అతడికి ఎన్వోసీ ఇవ్వడంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. అంతకంటే ముందు అతడి మొత్తం ఇంటర్వ్యూ చూడాల్సి ఉంది" అని అక్రమ్ పేర్కొన్నాడు.