ఢాకా వేదికగా జరిగిన బంగ్లాదేశ్ దేశవాళీ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. బ్యాట్స్‌మెన్ ఏకంగా 48 సిక్సర్లు, 70 ఫోర్లు బాదారు. ఈ అరుదైన ఘనత ఢాకా సెకండ్ డివిజన్‌లో నార్త్ బంగాల్ క్రికెట్ అకాడమీ, టాలెంట్ హంట్ అకాడమీ జట్ల పోరులో నమోదైంది.
సిక్సర్ల కోసం పోటీపడ్డారు..
తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ బంగాల్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 432 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో టాలెంట్ హంట్ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 386 పరుగులు చేసి ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో నార్త్ బంగాల్ బ్యాట్స్‌మెన్ 27 సిక్సర్లు, టాలెంట్ హంట్ బ్యాట్స్‌మెన్ 21 సిక్సర్లు బాదారు. మొత్తంగా ఈ పోరులో 818 పరుగులు నమోదయ్యాయి.
ఫిక్సింగ్ ఫలితాలు..!
బంగ్లాదేశ్ దేశవాళీ మ్యాచ్‌ల్లో అసాధారణ ఫలితాలు ఎప్పుడూ వస్తుంటాయి. మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి అక్కడ ఎక్కువగా జరుగుతుంటుంది. 2017లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన బౌలర్‌ను పదేళ్లు నిషేధించారు. అతడు వైడ్స్, నోబాల్స్ వేసి ఏకంగా 92 పరుగులు ఇచ్చాడు. బంతి నేరుగా బౌండరీకి వెళ్లేలా అతడు వైడ్స్, నోబాల్స్ వేశాడు.
తమ దేశవాళీ క్రికెట్‌లో అవినీతి జరుగుతుందని ఇటీవల నిషేధానికి గురైన బంగ్లాదేశ్ మాజీ సారథి షకిబ్ అల్ హసన్ కూడా గతంలో పేర్కొన్నాడు. షకిబ్ మాటలను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు హుస్సేన్ చౌదరి సమర్థించాడు.