భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం ప్రారంభమయ్యే చారిత్రక డే/నైట్ టెస్టు కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ సందర్భంగా బంగ్లా ఆటగాళ్లు ఒకడుగు ముందుకేసి పింక్ బాల్‌ను నీళ్లలో ముంచి మరీ ప్రాక్టీస్ చేస్తున్నారు. డే/నైట్ టెస్టుపై మంచు ప్రభావం ఉన్నందున ఆ పరిస్థితులకు అలవాటు పడేలా ప్రాక్టీస్ చేస్తున్నామని బంగ్లా స్పిన్నర్ మెహిది హసన్ తెలిపాడు.
సోమవారం బంగ్లా ఆటగాళ్లు సుమారు మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేశారు. ప్రధాన కోచ్ రసెల్ డొమింగో ఆధ్వర్యంలో క్యాచ్‌లు పట్టడంలో శిక్షణ పొందారు. ఈ మూడు రోజులూ తమ పేస్ బౌలర్లు బంతిని తడిగా చేసి ప్రాక్టీస్ చేస్తారని, ఈ విధంగా పింక్ బాల్ టెస్టుకు అలవాటు పడతామని హసన్ వివరించాడు. బంతి తడిగా మారితే.. అది జారుతుందని, అయినా స్పిన్నర్లకు బౌన్స్, టర్న్ లభిస్తుందని తెలిపాడు.
"పింక్ బాల్‌కు మేమింకా అలవాటు పడలేదు. దానితో ఆడటానికి ఎక్కువ సమయం దొరకలేదు. అయినా వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి కృషి చేస్తాం. ఈ బంతితో ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆడే కొద్ది అలవాటు పడతారు. అలాగే బ్యాట్స్‌మెన్ ఎక్కువ సేపు క్రీజులో ఉండాల్సిన అవసరం ఉంది. పరిస్థితులకు అలవాటు పడే వరకూ ఉండాల్సిందే. క్యాచ్‌లు పట్టేటప్పుడు, ఫీల్డింగ్ చేసేటప్పుడు పెద్ద ఇబ్బందులేమీ లేవు. అయినా మ్యాచ్‌లో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి బంతి కూడా కనపడదు."
-మెహిది హసన్, బంగ్లా స్పిన్నర్
శుక్రవారం జరగబోయే టెస్టుకు టీమిండియా ఆటగాళ్లూ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశారు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై శ్రద్ధపెట్టారు.
ఇవీ చూడండి.. ఐపీఎల్: దిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు శ్రేయస్‌కే..