ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్... అడిలైడ్ వేదికగా ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 335 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఆ మ్యాచ్‌లో వార్నర్ దూకుడు మీద ఉన్నప్పుడు కంగారూ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ డిక్లేర్ ప్రకటించాడు. ఈ నిర్ణయంపై క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే టెస్టుల్లో అత్యధిక స్కోరైన లారా రికార్డు(400*)ను వార్నర్ బద్దలు కొట్టేస్తాడని అంతా అనుకున్నారు. తాజాగా ఈ అంశంపై స్పందించిన వార్నర్.. లారాతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.
ఈ మ్యాచ్ చూడటానికి లారా స్టేడియానికి రావడం విశేషం. ఆట ముగిసిన తర్వాత ఈ విండీస్ దిగ్గజాన్ని కలిసిన వార్నర్.. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాడు.
" దిగ్గజ ఆటగాడిని కలవడం నిజంగా సంతోషం. ఏదో ఒకరోజు అతడి(లారా) 400 పరుగుల రికార్డును బ్రేక్ చేసే అవకాశం వస్తుందని అనుకుంటున్నా"
- డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా క్రికెటర్
16 ఏళ్లుగా అదే రికార్డు..
1957-58 కాలంలో 365* పరుగులు చేసి తొలిసారి టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేశాడు దిగ్గజ విండీస్ ఆటగాడు గార్ఫీల్డ్ సోబర్స్. ఆ తర్వాత 1993-94లో 375 రన్స్ చేసి ఆ రికార్డును బ్రేక్ చేశాడు లారా. మళ్లీ 2003-04లో టెస్టుల్లో ఎవరికీ సాధ్యం కాని విధంగా 400* పరుగులతో రికార్డు నెలకొల్పాడీ విండీస్ దిగ్గజం.
అనంతరం ఆసీస్ మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ (380), శ్రీలంక మాజీ బ్యాట్స్‌మన్ జయవర్దనే (374) వంటి ఎందరో ప్రయత్నించినా... లారా రికార్డు బ్రేక్ చేయలేకపోయారు. దాదాపు 16 ఏళ్లుగా ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది.