ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య ఆగస్టులో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు ఇరుదేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. ఆస్ట్రేలియాలో కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ఈ పరిస్థితుల్లో క్రీడా టోర్నీలు పునఃప్రారంభించడం కష్టమని తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఇప్పటికే 7,836 కేసులు నమోదు కాగా 104 మంది మరణించారు.
"ఈ సిరీస్ వాయిదా వేయడం మాకు నిరాశగా ఉన్నప్పటికీ.. ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు, వాలంటీర్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. రీషెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తాం".
- నిక్ హాక్లే, క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ
"ఆస్ట్రేలియాతో ఆడటానికి మేమెంతో ఆసక్తిగా ఉన్నాం. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పర్యటన జరిగే వీలులేదు. ఏదేమైనా ఈ టూర్‌ను రీషెడ్యూల్ చేసి ముందుకు తీసుకెళ్లడానికి పరిశీలన చేస్తున్నాం" అని జింబాబ్వే క్రికెట్ జట్టు మేనేజర్ గివ్మోర్ మకోని వెల్లడించారు.
2003-04లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ కోసం ఆసీస్ పర్యటనకు జింబాబ్వే వెళ్లాల్సి ఉంది.