32 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన 'బాక్సింగ్ డే' టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు శనివారం ముగిసింది. ఇందులో ఆసీస్ జట్టు 247 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. ఫలితంగా 2-0 తేడాతో కప్పు ఎగరేసుకుపోయింది కంగారూ జట్టు. ఈ విజయంతో టెస్టు ఛాంపియన్షిప్ పట్టికలో 256 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది ఆసీస్. ఈ మ్యాచ్‌లోనే ఆసీస్ పేసర్ పీటర్ సిడెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాడు.
అందుకే ఫాలోఆన్ ఆడట్లేదా...!
తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగుల భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా... ప్రత్యర్థి జట్టును 148 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇటీవల ఐపీఎల్ వేలంలో రికార్డు ధర అందుకున్న కమిన్స్... కంగారూ జట్టు ఆధిపత్యం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ పేసర్ 28 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగుల ఆధిక్యం లభించినా ఫాలోఆన్ ఆడించని ఆస్ట్రేలియా... రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌కు దిగింది. 54.2 ఓవర్ల ఆడి 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఫలితంగా 487 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది.
ఛేదనలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో 240 రన్స్‌కే ఆలౌట్ అయింది కివీస్ జట్టు. టామ్ బ్లండెల్ మాత్రమే 121 రన్స్ చేసి ఒంటరి పోరాటం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లు లయన్ 4 , ప్యాటిన్సన్ 3 వికెట్లు తీశారు. శతకంతో రాణించిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్కే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. నామమాత్రపు చివరి మ్యాచ్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.
ఇదే కారణమా...!
2001లో భారత్‌ను ఫాలోఆన్ ఆడించి కంగుతింది ఆస్ట్రేలియా జట్టు. ఆ మ్యాచ్‌లో వీవీఎస్ లక్ష్మణ్ 281 పరుగుల వ్యక్తిగత స్కోరు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అప్పట్నుంచి ఏ జట్టునూ ఫాలోఆన్ ఆడించేందుకు ఆస్ట్రేలియా పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. ఫాలోఆన్ ఆడించడం వల్ల ఇన్నింగ్స్ తేడాతో గెలిచే అవకాశం లభిస్తుంది. ఇటీవల కోహ్లీసేన మాత్రం నాలుగుసార్లు ప్రత్యర్థి జట్లపై ఇన్నింగ్స్ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించడం విశేషం.
80 వేల మందికి పైగా హాజరు...
న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్లు 1987లో బాక్సింగ్ డే (డిసెంబర్ 26) టెస్టులో తలపడ్డాయి. అప్పడు 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో గెలిచింది కంగారూ జట్టు. ప్రస్తుత కివీస్ జట్టులోని నీల్ వాగ్నర్, రాస్ టేలర్, వాట్లింగ్, గ్రాండ్‌హోమ్ మాత్రమే అప్పటికి జన్మించారు. తాజాగా మళ్లీ 2019లో ఈ సిరీస్ జరిగింది. మెల్బోర్న్లో జరిగిన ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో అభిమానులు హాజరయ్యారు. దాదాపు 80 వేల మందికి పైగా వీక్షకులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఇప్పటివరకు ఇదే అత్యధికం, నాన్ యాషెస్ మ్యాచ్‌లో ఇది రెండోస్థానం. గతంలో ఈ మైదానంలో 51,087 మంది అభిమానులు హాజరైన రికార్డు ఉండేది. 1975లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 85,661 మంది వీక్షకులు హాజరవడం ఇప్పటికీ చరిత్రగా మిగిలిపోయింది.
ఇదీ చదవండి...