ఈ ఏడాది చివర్లో భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 3న తొలి మ్యాచ్‌లో ఇరుజట్లు తలపడనున్న నేపథ్యంలో.. లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. గతంలో కోహ్లీ జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లినప్పుడు.. 2-1తేడాతో కప్పు కైవసం చేసుకుంది. ఆసీస్‌లో టెస్టు సిరీస్ గెలిచిన తొలి భారత జట్టుగా చరిత్ర సృష్టించింది. అయితే, ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులోకి స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ తిరిగి రావడం వల్ల.. సొంతగడ్డపై కంగారూ జట్టు విజృంభించే అవకాశం ఉందని లీ తెలిపాడు.
![Australia must put Kohli under pressure early in the series: Lee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8062368_fsdfs.jpg)
"నేను ఎంతగానో ఎదురు చూసే ఉత్తమ సిరీస్‌ల్లో ఇది ఒకటి. ఈసారి ఆస్ట్రేలియా కచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. కానీ, టీమ్ఇండియా.. ఆసీస్‌కు గట్టిపోటీ ఇస్తుంది. అయితే, నా వరకు ఆసీస్ తన సొంత గడ్డపై చాలా బలంగా ఉంటుందని అనుకుంటున్నా."
-బ్రెట్ లీ, ఆస్ట్రేలియా మాజీ బౌలర్
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీని ఒత్తిడికి గురి చేస్తే.. ఆస్ట్రేలియాదే విజయమని అన్నాడు లీ. "కోహ్లీ ప్రపంచ స్థాయి ఆటగాడు. ఆస్ట్రేలియా బౌలర్లు అతనికి బౌలింగ్ చేసే సమయంలో స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి. ఈ సిరీస్ ప్రారంభంలో ఆసీస్ బౌలర్లు కోహ్లీని ఒత్తిడికి గురి చేయగలిగితే.. కంగారూ జట్టు ఆధిపత్యం వహించే అవకాశం ఉంది." అని బ్రెట్ లీ పేర్కొన్నాడు.
![Australia must put Kohli under pressure early in the series: Lee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8062368_gfds.jpg)
అంతే కాకుండా, భారత జట్టులో బలమైన పేసర్లు ఉన్నారని, గత పర్యటనలో బౌలర్లు చూపిన స్థిరత్వమే టీమ్ఇండియా విజయానికి చేరువయ్యేలా చేసిందని వివరించాడు. ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకుని.. భారత పేసర్లు పోటీకి సిద్ధంగా ఉంటారని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చూడండి:ట్రైనింగ్ ఇస్తే ఇప్పుడూ క్రికెట్ ఆడేస్తా: గంగూలీ