ఆసీస్ దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ అరుదైన ఘనత అందుకున్నాడు. తను ధరించే బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను వేలానికి పెట్టగా.. క్రికెట్ చరిత్రలో అత్యంత రికార్డు స్థాయి ధర అందుకుంది. ఆ టోపీని దాదాపు రూ.3.70 కోట్లకు కొనుగోలు చేసేందుకు సిడ్నీకి చెందిన ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. ఫలితంగా ఇంత భారీ ధరకు అమ్ముడుపోయిన ఓ క్రికెటర్ వస్తువుగా రికార్డు సృష్టించింది. తాజా రికార్డుతో ఆ దేశ దిగ్గజ క్రికెటర్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ బ్యాగీ గ్రీన్ వేలం ధర రెండోస్థానానికి పడిపోయింది. గతంలో బ్రాడ్‌మన్ టోపీ రూ. 3 కోట్ల 2 లక్షలకు పైగా ధరకు అమ్ముడుపోయింది.
ఈ జాబితాలో మూడో స్థానంలో ఎంఎస్ ధోనీ బ్యాట్ నిలిచింది. 2011 వరల్డ్‌కప్ ఫైనల్లో మహీ ఆడిన బ్యాట్‌ను వేలం వేయగా.. దాని విలువ సుమారు రూ.కోటి పలికింది.
మంచి పనికి విరాళం...
కొంతకాలంగా ఆస్ట్రేలియాలో కార్చిచ్చు కారణంగా అడవులు తగలబడిపోతున్నాయి. ఇప్పటికే కోలా, కంగారూ వంటి జంతువులు కోట్ల సంఖ్యలో మరణించాయి. కొంతమంది ప్రాణాలూ కోల్పోయారు. తాజాగా కార్చిచ్చు ఉపశమన చర్యల కోసం ఈ డబ్బును విరాళంగా ప్రకటించాడు వార్న్.
అంతర్జాతీయ క్రికెట్లో ఆసీస్ తరఫున షేన్ వార్న్ 145 టెస్టులు, 194 వన్డేలు ఆడాడు. టెస్టులో 708 వికెట్లు, వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అగ్రస్థానంలో శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురలీధరన్ ఉన్నాడు. అతడు 800 వికెట్లు దక్కించుకున్నాడు.