యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు తలనొప్పిగా మారాడు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్. తొలి రెండు టెస్టుల్లో కంగారూ జట్టును నిలబెట్టిన స్మిత్(60) నాలుగో టెస్టులోనూ అదే జోరు కొనసాగించాడు. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించి క్రీజులో పాతుకుపోయాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ స్కోరు 170/3. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ 2 వికెట్లతో మరోసారి మెరవగా.. క్రేగ్ ఒవర్టన్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. బ్రాడ్ ధాటికి ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. వార్నర్(0) మరోసారి విఫలమయ్యాడు. 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న కంగారూ జట్టును స్మిత్ - లబుషేన్ జోడీ ఆదుకుంది. వీరిద్దరూ 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
నిలిచిన స్మిత్..
మొదటి టెస్టులో రెండు శతకాలు.. రెండో టెస్టులో 92 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు కొరకరాని కొయ్యగా మారిన స్మిత్ నాలుగో టెస్టులోనూ అర్ధశతకం చేసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 93 బంతుల్లో 60 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు.
వర్షం కారణంగా తొలి రోజు 44 ఓవర్ల ఆటే జరిగింది. మ్యాచ్ చివర్లో లబుషేన్‌ను ఒవర్టన్ ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్(60), హెడ్(18) ఆడుతున్నారు. అయిదు టెస్టుల సిరీస్ 1-1తో సమంగా ఉంది.
ఇది చదవండి: వినూత్నంగా సముద్రం మధ్యలో క్రికెట్