మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా దూకుడు కొనసాగిస్తోంది. కెప్టెన్ అజింక్యా రహానె(104*) శతకంతో మెరవడం వల్ల టీమ్‌ఇండియా రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 277/5 పరుగులు చేసింది.
ఓవర్‌నైట్ స్కోర్ 36/1తో రెెండో రోజు ప్రారంభించిన భారత జట్టు ఆచితూచి ఆడింది. రహానె(104) సెంచరీతో అజేయంగా నిలిచాడు. పుజారా(17), విహారి(21) మినహా గిల్(45), జడేజా(40*), పంత్(29) మంచి ఇన్నింగ్స్ ఆడారు. దీంతో రెండో రోజు ముగిసే సరికి టీమ్‌ఇండియా ఆసీస్‌పై 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో రహానే (104), జడేజా (40) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్ చెరో రెండు వికెట్లు సాధించగా, లైయన్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 195 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. బుమ్రా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు.
నాలుగు ఇక్కడ ఎనిమిది అక్కడ
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత సారథి రహానె సెంచరీ సాధించాడు. ఇది రహానెకు మొత్తంగా 12వ శతకం. ఇందులో నాలుగు స్వదేశంలో చేయగా.. ఎనిమిది విదేశీ గడ్డపై సాధించాడు.