ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగులకు ఇంగ్లీష్ జట్టు డిక్లేర్ చేసింది. బెన్‌స్టోక్స్ (115) అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆటముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
ఐదో రోజు ఆర్చర్ నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి చెమటోడ్చారు. గెలుపు సంగతేమో కానీ.. డ్రాగా ముగించడానికి కష్టపడ్డారు కంగారూ బ్యాట్స్‌మెన్. 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో లాబస్చేంజ్(59), హెడ్ (42) నాలుగో వికెట్‌కు 85 పరుగులు జోడించారు.
మధ్యలో స్పిన్నర్ జాక్ లీచ్, ఆర్చర్ ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. వీరి ధాటికి స్వల్ప వ్యవధిలోనే మరో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆసీస్. క్రీజులో ఉన్న హెడ్, కమిన్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఫలితంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్, లీచ్ చెరో మూడు వికెట్లు దక్కించుకున్నారు.
మొదటి ఇన్నింగ్స్‌లో 258 పరుగులు చేసిన ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అవే పరుగులు చేసింది. ఇలా చేయడం ఇంగ్లీష్ జట్టు క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.
తొలి కాంకషన్ సబ్స్టిట్యూషన్
ఆర్చర్ వేసిన బంతి తగిలి గాయంతో బాధపడిన ఆసీస్ ఆటగాడు స్మిత్ ఐదో రోజు ఆటకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా లాబస్చేంజ్ను ఎంపిక చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో 59 పరుగులతో సత్తాచాటాడీ బ్యాట్స్‌మెన్.
ఇవీ చూడండి.. గాయంతో స్మిత్ ఔట్.. తొలిసారి కాంకషన్‌కు అవకాశం