టీమ్ఇండియా మేనేజ్మెంట్పై మండిపడ్డాడు భారత మాజీ సారథి సునీల్ గావస్కర్. జట్టు యాజమాన్యం ఒక్కో ఆటగాడి పట్ల ఒక్కో రూల్ అవలంబిస్తోందని ఆరోపించాడు.
టీమ్ఇండియా సారథి కోహ్లీ.. తొలి టెస్టు పూర్తవ్వగానే పితృత్వ సెలవులపై స్వదేశానికి బయలుదేరాడు. అయితే ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమయంలో బౌలర్ టి.నటరాజన్‌కు బిడ్డ పుట్టింది. కానీ అతడు స్వదేశానికి తిరిగి రాలేదు. అతడికి పితృత్వ సెలవులు ఇవ్వలేదని తెలిసింది. ఇదే విషయంపై మాట్లాడిన గావస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
"నటరాజన్ కొత్తగా వచ్చాడు కాబట్టి పితృత్వ సెలవులు ఇవ్వకపోయినా ఏమీ మాట్లాడకుండా అలానే ఉండిపోయాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. అతడి ఆటతీరుకు మెచ్చిన సెలక్షన్ కమిటీ.. ఆస్ట్రేలియా పర్యటనలో తుదిజట్టులో చోటు కల్పించనప్పటికీ నెట్‌బౌలర్‌గా తీసుకుంది. ఐపీఎల్ అవ్వగానే నేరుగా ఆసీస్‌కు తీసుకెళ్లింది. ఆ తర్వాత తుది జట్టులో అనూహ్యంగా అతడికి అవకాశం రావడం వల్ల మరోసారి అద్భుత ప్రదర్శన చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. జనవరి మూడో వారంలో సిరీస్ పూర్తవ్వగానే స్వదేశానికి వెళ్లి తొలిసారి తన బిడ్డను చూడబోతున్నాడు. అది భారత క్రికెట్ అంటే. ఏదేమైనప్పటికీ టీమ్‌మేనేజ్‌మెంట్‌లో వివక్ష చూపిస్తారు. ఒక్కొక్కరికీ ఒక్కో రూల్. కావాలంటే ఈ విషయాన్ని రవిచంద్రన్ అశ్విన్, నటరాజన్‌ను అడగండి."
-సునీల్ గావస్కర్, టీమ్ఇండియా మాజీ సారథి.
కాగా, తొలి టెస్టులో ఘోరంగా ఓడిన టీమ్ఇండియా డిసెంబరు 26 నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టులో గెలవడం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం ఆసీస్ 1-0తో సిరీస్ ఆధిపత్యంలో ఉంది.
ఇదీ చూడండి : నేను పితృత్వ సెలవులు తీసుకోలేదు: గావస్కర్