మొహాలీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో వన్డే జరుగుతుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ తీసుకుంది. ఇప్పటికే 2-1 తేడాతో సిరీస్ ఆధిక్యంలో ఉన్న కోహ్లీ సేన ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ప్రపంచకప్ తుది జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న రిషభ్ పంత్ కు ఈ మ్యాచ్ కీలకం కానుంది.
మూడో వన్డేలో ఓటమిపాలైన భారత్ జట్టులో కొన్ని మార్పులు చేసింది. ధోనికి ఇప్పటికే విశ్రాంతి ఇస్తున్నట్లు ప్రకటించిన యాజమాన్యం పంత్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించింది. షమి గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమవగా ఆ స్థానంలో భువనేశ్వర్ ఆడనుండగా రాయుడు స్థానంలో రాహుల్ కి అవకాశం ఇచ్చింది. జడేజా స్థానంలో చాహల్ ఆడనున్నాడు.
మెగా టోర్నీకి ముందు టాప్ ఆర్డర్ సమస్య జట్టును ఇబ్బందిపెడుతోంది. ఓపెనర్లు రోహిత్, ధావన్ వరుస మ్యాచుల్లో విఫలమవుతున్నారు. కోహ్లీ ఈ సిరీస్ లో రెండు సెంచరీలతో 283 పరుగులు సాధించగా.. కేదార్ 118 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఆకట్టుకోలేకపోతున్నారు.
ఓపెనర్ రోహిత్ మూడు మ్యాచుల్లో కలిపి 51 పరుగులు చేయగా.. అంబటి రాయుడు కేవలం 33, ధావన్ 22 పరుగులు సాధించారు. ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్‌కప్‌కు ముందు ఇంకో రెండు మ్యాచ్‌లే మిగిలున్న తరుణంలో వారు పుంజుకోవాల్సిన అవసరముంది.
భారత్ ఆటగాళ్లను భయపెడుతున్న మరో సమస్య ఆడం జంపా. పరుగులను కట్టడి చేస్తూ బ్యాట్స్‌మెన్ పై ఒత్తిడి పెంచడంలో సఫలమవుతున్నాడీ లెగ్ స్పిన్నర్.
జట్లు
భారత్
కోహ్లీ (కెప్టెన్), ధావన్, రోహిత్, రాహుల్, కేదార్ జాదవ్, విజయ్‌శంకర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, చాహల్, భువనేశ్వర్, రిషభ్ పంత్
ఆస్ట్రేలియా
ఫించ్, ఖవాజ్, హాండ్స్కోంబ్, షాన్ మార్ష్, మాక్స్ వెల్, ఆష్టన్ టర్నర్, కారే, జ్యే రిచర్డ్ సన్, కమిన్స్ ,జాసన్ బెహ్రండాఫ్, ఆడం జంపా.