క్రికెటర్ల జీవితచరిత్రలు వెండితెరపై వేగంగా తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు సచిన్, అజారుద్దీన్, ధోనీ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. భారత అగ్రశ్రేణి మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ గురించి ఇటీవలే ప్రకటన వచ్చింది. అయితే దీని కన్నా ముందే టీమిండియా సీనియర్ ప్లేయర్, మాజీ సారథి జులన్ గోస్వామి జీవితం ఆధారంగా తీస్తున్న చిత్రం పూర్తయ్యే అవకాశాలున్నాయి. 'ఛక్ దహా ఎక్స్‌ప్రెస్' అనే టైటిల్‌ను అనుకుంటోంది చిత్రబృందం.
ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. ఇందులో కోహ్లీ సతీమణి అనుష్కశర్మ.. ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సంస్థకు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ కృష్ణనే దర్శకుడు.
నేటి నుంచే షూటింగ్!
కోల్‌కతాలో నేటి(శనివారం) నుంచి ప్రారంభమైన షూటింగ్లో అనుష్క పాల్గొన్నట్లు సమచారం. ఇందుకోసం ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని ఎంపిక చేసుకున్నారట. ఆ తర్వాత ముంబయిలోనూ మరో షెడ్యూల్ చిత్రీకరణ జరగనుందని సమాచారం. ఈరోజు అనుష్క.. ముంబయి విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కడం.. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
37 ఏళ్ల జులన్ గోస్వామి.. అసోంలోని ఛక్ దహా ప్రాంతంలో జన్మించింది. 2002లో భారత తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసింది. మొత్తం 182 వన్డేలు, 68 టీ20లు, 10 టెస్టులు ఆడి 321 వికెట్లు తీసింది. వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌గానూ గతంలో చరిత్ర సృష్టించింది.
మరో రెండు
భారత ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌ను 'శభాష్ మిత్తు' పేరుతో తెరకెక్కించనున్నారు. ఇందులో తాప్సీ టైటిల్ రోల్లో కనిపించనుంది. వయకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తోంది. రాహుల్ ఢోలాకియా దర్శకుడు. అయితే చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు.
భారత తొలి ప్రపంచకప్(1983) నేపథ్యంలో '83' సినిమాను తీస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్నాడు. కబీర్ సింగ్ దర్శకుడు. ఈ ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.