2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక అమ్ముడుపోయిందని అప్పటి ఆ దేశ క్రీడాశాఖ మంత్రి మహీందనంద ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది. ప్రత్యేక పోలీసుల బృందం బుధవారం ఆ మంత్రి నుంచి వాంగూల్మం సేకరించగా.. భారత్‌తో జరిగిన ఆ ఫైనల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని మాత్రమే తనకు అనుమానాలున్నాయని చెప్పారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మహీందనంద.. "నా అనుమానాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలి. ఈ సందర్భంగా 2011 అక్టోబర్ 30న ఐసీసీకి నేను ఫిర్యాదు చేసిన పత్రాన్ని పోలీసులకు అందజేశా" అని తెలిపారు.
అంతకుముందు మహీందనంద చేసిన ఆరోపణల్ని అప్పటి లంక కెప్టెన్ కుమార సంగక్కర, బ్యాట్స్‌మన్ మహేలా జయవర్ధనే ఖండించారు. ఆయన ఆరోపణలకు ఆధారం చూపించాలని డిమాండ్ చేశారు. కాగా, ఇదే విషయంపై 1996లో ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక జట్టు సారథి అర్జున రణతుంగా కూడా గతంలో ఆరోపణలు చేశారు. 2011 ఫైనల్లో లంక ఓటమిపై విచారణ జరగాలని కోరారు.
ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆరు వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. జయవర్ధనే(103*) శతకంతో ఆదుకున్నాడు. అనంతరం టీమ్‌ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గంభీర్(97), ధోనీ(91*) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో ఇంకా పది బంతులుండగానే ధోనీ అద్భుతమైన సిక్స్‌తో చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. దాంతో ప్రపంచకప్‌ను ముద్దాడాలనే సచిన్ తెందూల్కర్ సుదీర్ఘ కల నెరవేరింది.