అఫ్గానిస్థాన్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు సస్పెన్షన్ విధించింది. నియమాలను ఉల్లంఘించిన కారణంగా ఏడాది పాటు వేటు వేసింది. అనుమతి లేకుండా విదేశాల్లో ఆడాడని, శిక్షణ తీసుకున్నాడని ఆరోపించింది. నిషేధిత కాలంలో షెహజాద్ ఏ ఫార్మాట్లోనూ పాల్గొనేందుకు వీలులేదని తెలిపింది.
"షెహజాద్.. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) క్రమశిక్షణా నియమాలను, నిబంధనలను ఉల్లంఘించాడు. అనుమతి లేకుండా వేరే దేశాల్లో ఆడాడు, శిక్షణ తీసుకున్నాడు. ఈ కారణంగా అతడిపై 12 నెలల సస్పెన్షన్ విధిస్తున్నాం" -ఏసీబీ ప్రకటన
క్రికెట్ సాధన, శిక్షణ కోసం ఏసీబీ వద్ద అన్ని సౌకర్యాలు ఉన్నాయని, వాటి కోసం విదేశాలకు వెళ్లడం నియమాలను ఉల్లంఘించడమేనని ప్రకటనలో తెలిపింది ఏసీబీ.
మోకాలి గాయం, ఫిట్నెస్ లేమితో ప్రపంచకప్‌లో అతడి స్థానంలో వేరొకరికి అవకాశం కల్పించింది ఏసీబీ. కావాలనే తనను మెగాటోర్నీకి దూరంగా పెట్టారని షెహజాద్ ఆరోపించాడు. ఆ అంశం వివాదాస్పదమైంది.
ఇది చదవండి: అక్తర్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన యువీ