ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను యూఏఈలో కాకుండా.. భారత్‌లోనే నిర్వహించాలని ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు పిటిషనర్ ఆదిత్యా వర్మ బీసీసీఐ చీఫ్ సౌరభ్ గంగూలీని కోరాడు. యూఏఈలోనూ కరోనా విజృంభిస్తోందని.. ఆ దేశం కూడా ఆటగాళ్లకు అంత సురక్షితం కాదని బీసీసీఐకి ఓ లేఖ రాశాడు.
సెప్టెంబరు 19న యూఏఈ వేదికగా లీగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే కేంద్రం అనుమతి కోసం బీసీసీఐ ఎదురుచూస్తోంది. అయితే, ఐపీఎల్‌ను భారత్‌లోనే ఎందుకు నిర్వహించాలో వివరించాడు వర్మ.

"దుబాయ్ రగ్బీ సెవెన్స్ మ్యాచ్ యూఏఈలో చాలా పెద్ద ఈవెంట్. కానీ నవంబరులో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను అక్కడి ప్రభుత్వం వాయిదా వేసింది. అలాంటప్పుడు ఐపీఎల్‌ను అక్కడ ఎలా నిర్వహిస్తాం?. అందుకే దాదాకు రాసిన లేఖలో ఐపీఎల్‌ను భారత్‌లోనే జరపాలని కోరా."
-ఆదిత్యా వర్మ
యూఏఈలో మూడు వేర్వేరు జోన్లలో మ్యాచ్‌లు నిర్వహించడం కంటే.. మంబయి వంటి మహానగరంలో బయో బబుల్ విధానంతో లీగ్ జరపడం ఎంతో సులభమని వర్మ ఉద్ఘాటించాడు. అలాగే లక్ష కంటే తక్కువ కేసులున్న దుబాయ్‌తో పోలిస్తే.. విదేశీ ఆటగాళ్లు భారత్ ప్రయాణించే విషయంలో జాగ్రత్తగా ఉంటారని అన్నాడు. "లీగ్‌లో 60 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో వారు రావడానికి ఇష్టపడకపోతే.. ఆ స్థానంలో భారత ఆటగాళ్లను భర్తీ చేయొచ్చు" అని వర్మ తెలిపారు.
