విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడేందుకు తాను ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ఆరోన్ ఫించ్ అన్నాడు. అతడిలోని పోటీతత్వం, తీవ్రత ఐపీఎల్-2020లో రాణించేందుకు తనకు ప్రేరణ కల్పిస్తుందని పేర్కొన్నాడు. చిన్నస్వామిలో ఆడితే ఇంకా బాగుండేదని, యూఏఈ అయినప్పటికీ ఫర్వాలేదని అతడు వెల్లడించాడు.
ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్ సారథి ఫించ్‌ను ఈ ఐపీఎల్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.4.4 కోట్లకు కొనుగోలు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోటీపడి మరీ దక్కించుకుంది. ఇప్పటి వరకు ట్రోఫీ అందుకోని ఆర్‌సీబీకి.. అతడి విధ్వంసకర బ్యాటింగ్ సామర్థ్యం ఏదో ఒక విధంగా ఉపయోపడుతుందని నమ్ముతోంది.
"ఆర్‌సీబీలో ఎప్పుడెప్పుడు చేరతానా అని ఆత్రుతగా ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లున్న ఆ ఫ్రాంచైజీ తరఫున ఆడటం సరదాగా ఉంటుంది. చిన్నస్వామిలో సొంత అభిమానుల మధ్య ఆడితే అద్భుతంగా ఆడేంది. యూఏఈ అయినప్పటికీ నాకు ఫర్వాలేదు. తొలిసారి నేను విరాట్ నాయకత్వంలో ఆడుతున్నా. అంతర్జాతీయ క్రికెట్లో, ఐపీఎల్‌లో ఇప్పటి వరకు అతడికి ప్రత్యర్థిగానే బరిలోకి దిగడం వల్ల నాకు ఉత్సాహంగా అనిపిస్తోంది. అతడి పోటీతత్వం ఏంటో నాకు తెలుసు. అందుకే నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా"
-- ఆరోన్ ఫించ్, ఆస్ట్రేలియా క్రికెటర్
"ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి నా అనుభవం కచ్చితంగా ఉపయోగపడుతందనే అనుకుంటున్నా. అలా జరిగితే విరాట్‌పై ఒత్తిడి తగ్గించేందుకు నేను సాయం చేయగలను. ఇందుకు అవసరమైన ప్రతిదీ చేస్తాను" అని ఫించ్ వెల్లడించాడు.
సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు టోర్నీ జరిగనుంది. ఇప్పటి వరకు ట్రోఫీ గెలవని ఆర్‌సీబీ ఈసారైనా కప్‌ను ముద్దాడుతుందో లేదో చూడాలి.