"ఆటకు దూరమయ్యా.. కానీ ఆడటం మర్చిపోలేదు" అని అంటున్నాడు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్. పదే పదే గాయాలపాలై, గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న గబ్బర్.. త్వరలో జరగనున్న శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌లకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ధావన్.. ఇది తనకు మంచి ఆరంభమని, జట్టుకు దూరమైనా.. ఆడటం మర్చిపోలేదని చెప్పాడు.
"ఇది నాకు ఫ్రెష్ స్టార్ట్(మంచి ఆరంభం). వేలు, మెడ, కన్ను, మోకాలు.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వరుస గాయాలతో ఇబ్బంది పడ్డా. శుభవార్త ఏంటంటే నూతన సంవత్సరం రాబోతుంది. కేఎల్ రాహుల్ ప్రదర్శనతో ఆనందంగా ఉన్నా. అతడు అవకాశాన్ని బాగా అందిపుచ్చుకున్నాడు. త్వరలో నేను నిరూపించుకోవాల్సి ఉంది." - శిఖర్ ధావన్, టీమిండియా ఓపెనర్.
ఆటలో గాయలు సహజమని అన్నాడు ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్ ధావన్.
"ఆటలో గాయలపాలవడం సహజం. ఇది మనం అంగీకరించి తీరాల్సిందే. ఇప్పుడు బాగానే ఉన్నా. ఈ విషయంపై అనవరసర ఆర్భాటం చేయదల్చుకోలేదు. నాపై వీటి ప్రభావం ఏ మాత్రం లేదు. బ్యాటింగ్ ఆడటం మర్చిపోలేదు. ఎప్పుడు నా శైలి నాతోనే ఉంటుంది. పరుగుల ప్రవాహం సృష్టిస్తా" - శిఖర్ ధావన్, టీమిండియా ఓపెనర్
శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం రోహిత్ విశ్రాంతి తీసుకోగా.. ఆస్ట్రేలియా సిరీస్‌కూ ముగ్గురు(ధావన్, రాహుల్, రోహిత్) అందుబాటులో ఉన్నారు. ఇలాంటి తరుణంలో జట్టు యాజమాన్యానికి తలనొప్పేనని గబ్బర్ అభిప్రాయపడ్డాడు.
"ఇది చాలా ముఖ్యమైన సీజన్. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో సత్తాచాటుతానని అనుకుంటున్నా. ఈ విషయంలో జట్టు యాజమాన్యానికి తలనొప్పే. అయితే వాళ్లు బాధ్యతను వాళ్లు నిర్వర్తించారు. నా పని నేను చేయాలి. భారీ స్కోర్లు చేసేందుకు ప్రయత్నిస్తా" - శిఖర్ ధావన్, టీమిండియా ఓపెనర్
ఇప్పటికే టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు ధావన్. రోహిత్, మయాంక్ ఓపెనర్లుగా అతడి స్థానాన్ని భర్తీ చేయగా.. పృథ్వీ షా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే టెస్టు జట్టులో ఉన్నానా, లేనా? అనేది అంత ముఖ్యం కాదని చెప్పాడు ధావన్.
"నేను టెస్టు జట్టులో ఉన్నానా లేనా? అనేది అంత ముఖ్యం కాదు. నేను ఏం ఆడుతున్నానో నాకు తెలుసు. రంజీల్లో సత్తాచాటి మళ్లీ పుంజుకున్నందకు ఆనందంగా ఉంది. మూడు ఫార్మాట్లలో ఆడాలనేదే నా లక్ష్యం. ఫిట్నెస్ సాధించి దీని కోసమే కష్టపడతా. మొదటి 20 రోజులైతే నేను నడవడానికే ఇబ్బంది పడ్డా. అనంతరం ఫిట్‌నెస్‌పై దృష్టి పెడతా." -శిఖర్ ధావన్ , టీమిండియా ఓపెనర్
జనవరి 5నుంచి శ్రీలంకతో మూడు టీ20లు ఆడనుంది టీమిండియా. జనవరి 14న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.
ఇదీ చదవండి: ర్యాంకింగ్స్: ఈ ఏడాదిని అగ్రస్థానంతో ముగించిన కోహ్లీ