బలమైన భారత జట్టుతో టెస్టు సిరీస్ అంటే మరో యాషెస్ సిరీస్‌లాంటిదని ఆస్ట్రేలియా టెస్టు జట్టు సారథి టిమ్‌పైన్ తెలిపాడు. "టీమ్ఇండియా ఎంతో ప్రత్యేకమైన జట్టు. ఇతరుల కంటే బలమైనది. భారత్‌తో పోరు అంటే యాషెస్ సిరీస్ లాంటిదే. వారితో సిరీస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం. ఇరుజట్లు ఎంతో బలమైనవి కాబట్టి సిరీస్ కచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుంది" అని పైన్ అన్నాడు. ఇంగ్లాండ్, ఆసీస్ మధ్య జరిగే యాషెస్ సిరీస్‌ను ఇరు జట్లు ఎంతో ప్రతిష్ఠాత్మంకగా భావిస్తుంటాయి.
2018-19 ఆసీస్ పర్యటనలో భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. అయితే ఆ సమయంలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ జట్టులో లేరు. కానీ, ఇప్పుడు వారూ జట్టులో ఉండటం.. లబుషేన్ తోడవడం వల్ల జట్టు బలోపేతంగా మారిందని పైన్ అభిప్రాయపడ్డాడు. "స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ పరుగుల ప్రవాహం సృష్టిస్తారు. మార్నస్ లబుషేన్ సత్తాచాటుతూ మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. భారత్‌తో గతంలో ఆడినప్పుడు వీరు లేరు. అయితే టీమ్ఇండియా బౌలింగ్ దళం పటిష్ఠమైనదని మాకు తెలుసు. కానీ, అత్యుత్తమ టాప్ 6 బ్యాట్స్‌మెన్‌లో మా ఆటగాళ్లు ముగ్గురు ఉన్నారు. మేం ప్రత్యర్థిని సమర్థంగా ఎదుర్కొంటాం" అని తెలిపాడు.
ఇదీ చూడండి.. కరోనా బాధితుల కోసం ప్రపంచకప్ జెర్సీ వేలం