రోహిత్ శర్మ.. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా జట్టులోకి వచ్చి ఓపెనర్‌గా అవకాశం దక్కించుకుని ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ సమయంలో ఇన్నింగ్స్ ప్రారంభించాడో కానీ అప్పటినుంచి జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌లో అత్యధిక సగటు (58.11)తో దూసుకెళ్తున్నాడు. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాడు ఆమ్లా కంటే పది పాయింట్లు ముందున్నాడు. వన్డే క్రికెట్లో ఏకంగా మూడు డబుల్ సెంచరీలతో రికార్డు నెలకొల్పాడు. గతేడాది జరిగిన వన్టే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు బాది మరో ఘనత సాధించాడు. ప్రసుత్తం హిట్‌మ్యాన్‌కు 33 ఏళ్లు. అంటే ఇంకొంత కాలం తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉండొచ్చు. మరి ప్రసుతం ఉన్న యువ ఆటగాళ్లలో రోహిత్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు ఉన్నారా? ఉంటే వారెవరో చూద్దాం.

పృథ్వీ షా
పృథ్వీ షా ఆటతీరు చూస్తే సచిన్ తెందుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరినీ తలపిస్తాడు. 2018లో టెస్టు అరంగేట్రం చేసిన ఇతడు.. వచ్చీ రాగానే సెంచరీతో అలరించాడు. భవిష్యత్‌పై ఆశలు రేకెత్తించాడు. తర్వాత గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. డోపింగ్ వివాదంతో ఈ ఏడాది ఫిబ్రవరి వరకు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. ఇప్పటివరకు కేవలం 3 టెస్టులు, 3 వన్డేలు మాత్రమే ఆడిన షా ప్రతిభపై జట్టు నమ్మకంతో ఉంది. ఇప్పటికే 2018 అండర్-19 ప్రపంచకప్‌లో జట్టుకు ట్రోఫీ అందించాడు. నాయకత్వ లక్షణాలు కూడా ఉండటం ఇతడికి పెద్ద బలం. భవిష్యత్‌లో రోహిత్ స్థానంలో ఓపెనర్‌గా కుదురుకునే అవకాశం ఇతడికి మెండుగా ఉంది.

శుభ్‌మన్ గిల్
2018 అండర్-19 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు శుభ్‌మన్. బ్యాటింగ్‌లో ఇతడికి మూడు, నాలుగో స్థానాలు సరిగ్గా సరిపోతాయి. అయితే ఐపీఎల్లో కోల్‌కతా నైటరైడర్స్ జట్టు తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇతడు ప్రశాంతంగా ఉంటూ.. విభిన్న షాట్లతో అలరించాడు. టీమ్ఇండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నా సరే ఆడే అవకాశం రాలేదు. కోల్‌కతా జట్టుకు దినేష్ కార్తీక్ తర్వాత సారథ్య బాధ్యతలు చేపట్టబోయే అవకాశం శుభ్‌మన్‌కే ఎక్కువగా ఉంది. ఇతడు దేవధర్ ట్రోఫీలో ఇండియా-సీకి నాయకత్వం కూడా వహించాడు. ఇతడికి టాపార్డర్‌లో సరైన అవకాశాలు కల్పిస్తే మరో రోహిత్ అయ్యే అవకాశముంది.

రిషభ్ పంత్
ప్రస్తుతం టీమ్ఇండియాలో అస్థిరమైన ఆటగాడెవరైనా ఉన్నారంటే అది రిషభ్ పంత్. ఎన్ని అవకాశాలు ఇచ్చినా అప్పనంగా వికెట్‌ను సమర్పించుకుంటూ విమర్శల పాలవుతున్నాడు. బాధ్యతారాహిత్య షాట్లతో జట్టులో చోటు కోల్పోయాడు. అయితే రోహిత్ శర్మ కూడా ప్రారంభంలో ఇలాగే వికెట్ సమర్పించుకున్నాడు. కానీ తర్వాత గాడిన పడి టాప్ ఓపెనర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పుడు పంత్ కూడా తన తప్పులను సరిచేసుకుంటే గొప్ప ఆటగాడవుతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దిల్లీ క్యాపిటల్స్‌తో పాటు టీమ్ఇండియాకు నాలుగో స్థానంలో ఆడుతున్న పంత్ సామర్థ్యం బయటకు రావాలంటే టాపార్డర్‌లో ఆడించాలని అంటున్నారు. కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ అతడిపై నమ్మకముంచి ఓపెనర్‌గా ప్రమోషన్ కల్పించే అవకాశమూ లేకపోలేదు.
