ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోడానికి ఇదో చక్కని వేదిక. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్న ఈ లీగ్‌లో అదరగొడితే.. టీమ్ఇండియాలోనూ చోటు దక్కే అవకాశాలు మెరుగుపడతాయి. అలా ఎందరో యువ క్రికెటర్లు ఐపీఎల్లో ఆడి, భారత జెర్సీలో కనువిందు చేశారు. మరెందరో వేలంలోనూ భారీ ధర పలికి ఫేమ్ తెచ్చుకున్నారు. అయితే ఓ ముగ్గురు ఆటగాళ్లకు మాత్రం అదృష్టం కలసిరాలేదు. ఈ లీగ్‌లో హ్యాట్రిక్ తీసినా సరే అంతర్జాతీయ క్రికెట్లో వారికి అవకాశాలు దక్కలేదు. ఈ ముగ్గురు భారతీయులు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడినవారు కావడం విశేషం.
1. అజిత్ చండేలా(ఐపీఎల్ 2012)
టీ20ల్లో పరుగులు నియంత్రిస్తూ.. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేయగలిగే బౌలర్లలో అజిత్ చండేలా ఒకడు. 2012 సీజన్లో ఇతడో అనామక క్రికెటర్. అనంతరం మెగాటోర్నీలో తనదైన ప్రదర్శనతో హ్యాట్రిక్ అందుకొని అందరి దృష్టి ఆకర్షించాడు. లీగ్‌లో ఈ ఫీట్ సాధించిన ఏడో బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన రికార్డు సాధించాడు. వరస బంతుల్లో ఉతప్ప, జెస్సీ రైడర్, సౌరభ్ గంగూలీ వికెట్లను పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాతి బంతికి అనుస్తూప్ మజుంధర్ను ఔట్ చేసి 4/13 గణాంకాలు(4 ఓవర్లలో) సాధించి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గానూ నిలిచాడు.
2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకుని కెరీర్ పాడుచేసుకున్నాడు చండేలా. శ్రీశాంత్, అంకిత్ చవాన్లతో పాటు ఇతడిపైనా బీసీసీఐ 2016లో జీవితకాల నిషేధం విధించింది.
2. ప్రవీణ్ తాంబే(ఐపీఎల్ 2014)
ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లలో ప్రవీణ్ తాంబే ఒకడు. 41 ఏళ్ల వయసులోనూ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడాడు.
రాజస్థాన్ రాయల్స్‌కు(ఆర్ఆర్) ఆడుతున్నప్పుడే ఇతడు హ్యాట్రిక్ సాధించాడు. ప్రత్యర్థి కోల్క్తా నైట్‌రైడర్స్(కేకేఆర్) 177 లక్ష్య ఛేదనలో బరిలోకి దిగింది. 15 ఓవర్లపాటు అద్భుతంగా ఆడి విజయం దిశగా దూసుకెళ్తోంది. ఆ సమయంలో 16వ ఓవర్‌కు బంతి అందుకున్న తాంబే.. మనీష్ పాండే, యూసఫ్ పఠాన్, ర్యాన్ టెన్ డస్కటేను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ 10 పరుగుల తేడాతో నెగ్గింది. తాంబే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు.
- ' class='align-text-top noRightClick twitterSection' data=''>
ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో 48 ఏళ్ల ఈ క్రికెటర్‌ను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ముందుకొచ్చినా.. ఓ విదేశీ లీగ్‌కు దరఖాస్తు చేయడం వల్ల ఆ అవకాశం కోల్పోయాడు. ఇప్పటికే కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో చోటు దక్కించుకున్న తొలి భారతీయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ లీగ్ ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది.
3. శ్రేయస్ గోపాల్(ఐపీఎల్ 2019)
ఐపీఎల్లో లేటెస్ట్గా హ్యాట్రిక్ సాధించిన వారిలో శ్రేయస్ గోపాల్ ఉన్నాడు. ఐపీఎల్లో హ్యాట్రిక్ సాధించిన 19వ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. పెద్దగా ఫేమస్ కాని ఈ యువ క్రికెటర్.. 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో దుమ్ములేపాడు. వరుస బంతుల్లో కోహ్లీ, డివిలియర్స్, స్టొయినిస్‌ను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్ ఆడకుండానే ఇంటికి చేరగా.. ఆర్ఆర్ మాత్రం ఆశలు నిలుపుకుంది.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ రాణిస్తున్న ఇతడు.. ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగే అవకాశముంది. అంతేకాకుండా ఇప్పటికీ భారత జట్టు జెర్సీ ధరించాలని ఆశగా ఎదురుచూస్తున్నాడు.
- ' class='align-text-top noRightClick twitterSection' data=''>
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్-13 సీజన్ యూఏఈ వేదికగా జరగనుంది. సెప్టెంబర్ 19న లీగ్ ప్రారంభమై.. నవంబర్ 10న జరిగే ఫైనల్‌తో మెగాటోర్నీ ముగియనుంది.