టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన జోరుమీదున్న టీమిండియా వన్డే సిరీస్‌ను దక్కించుకోవాలని చూస్తోంది. అయితే వర్షం కారణంగా తొలి వన్డే రద్దు అవ్వగా.. రెండో మ్యాచ్ నేడు పోర్ట్ స్పెయిన్ వేదికగా జరగనుంది. ఇరుజట్లు విజయంపై ధీమాగా ఉన్నాయి.
యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ వన్డే జట్టులో చోటు సంపాదించాడు. మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా.. ఈ యువ ఆటగాడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఇప్పటికే టీమిండియాను మిడిలార్డర్ సమస్య బాధపెడుతోంది. శ్రేయస్ కుదురుకుంటే భారత్‌కు ఆ సమస్య కొంత తీరినట్టే అని చెప్పవచ్చు.
టాప్ ఆర్డర్లో రోహిత్, ధావన్, కోహ్లీ ఉండనే ఉన్నారు. అనంతరం కేదార్ జాదవ్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్లు సత్తా చాటాలని ఊవిళ్లూరుతున్నారు. బౌలింగ్‌లో షమి, భువనేశ్వర్‌లతో పాటు ఖలీల్ అహ్మద్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.
వెస్టిండీస్‌లో ఓపెనర్లు లూయిస్, గేల్ మెరుపుల కోసం ఆ జట్టు ఎదురుచూస్తోంది. టెస్టు జట్టులో స్థానం కోసం ఆశించిన గేల్‌కు నిరాశే మిగిలింది. ఫలితంగా చివరి రెండు వన్డేల్లో రాణించి క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తున్నాడీ కరీబియన్ విధ్వంసకర ఓపెనర్. వీరికి తోడు హోప్, హెట్మయర్, నికోలస్ పూరన్, ఫాబియాన్ అలెన్ మిడిలార్డల్‌లో మంచి ప్రదర్శన చేయాలని భావిస్తున్నారు. కాట్రెల్, ఒషానే థామస్, కీమర్ రోచ్లతో బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది.
వర్షం ముప్పు
రాత్రి 7 గంటలకు జరగాల్సిన రెండో వన్డేకూ వర్షం అడ్డంకిగా మారనుందని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ జరిగే స్టేడియం పరిసరాల్లో ఉదయం, మధ్యాహ్నం కొంత సేపు వర్షం పడే అవకాశాలున్నాయని తెలిపింది.
ఇవీ చూడండి.. పాండ్య సోదరుల నోట.. 'వై దిస్ కొలవరి' పాట