ముందు క్యాచేమో అని కంగారు పడ్డారు. తర్వాత ఫోర్ అనుకున్నారు. కానీ బంతి చూస్తే నేరుగా బౌండరీ అవతల పడింది. అంపైర్ రెండు చేతులూ పైకెత్తి 'సిక్స్' సంకేతం ఇచ్చాడు. అందరిలోనూ ఆశ్చర్యం! ఆ మెరుపు షాట్‌తోనే ఒక చారిత్రక ఇన్నింగ్స్‌కు పునాది పడింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్ అహాన్ని దెబ్బ తీసి.. ప్రత్యర్థుల్ని బెదరగొట్టి..జట్టులో ఎక్కడలేని ఉత్సాహం నింపి.. ఒక గొప్ప విజయానికి బాటలు పరిచిన షాట్ అది! ఆ షాట్, ఆ ఇన్నింగ్స్ సంగతులేంటో ఏంటో చూద్దాం పదండి.
అయిదు దశాబ్దాల వన్డే క్రికెట్ చరిత్రలో ఎన్నో మేటి ఇన్నింగ్స్‌లు. అందులో దిగ్గజ ఆటగాడు సచిన్ తెందుల్కర్‌వే ఎన్నో గొప్ప ప్రదర్శనలు కనిపిస్తాయి. వాటన్నింట్లోకి ఎన్నదగ్గది.. 2003 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై సాధించిన 98 పరుగుల మెరుపు ఇన్నింగ్స్. అప్పట్లో క్రికెట్ వీక్షణమే వేరుగా ఉండేది. ఆ తీవ్రత ఎలాంటిదన్నది మాటల్లో చెప్పడం కష్టం. పైగా పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే కొన్ని రోజుల ముందు నుంచే ఉత్కంఠ మొదలయ్యేది. మ్యాచ్ సమయానికి గుండె వేగం పెరిగిపోయేది. రోమాలు నిక్కబొడుచుకునేవి. భావోద్వేగాలు కట్టలు తెంచుకునేవి. అలాంటి నేపథ్యంలో పాకిస్థాన్‌తో గ్రూప్ దశ మ్యాచ్. టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ అనగానే రెచ్చిపోయే ఆ జట్టు ఓపెనర్ సయీద్ అన్వర్ (101) సెంచరీ కొట్టాడు.
మిగతా బ్యాట్స్‌మెన్ కూడా తలో చేయి వేయడం వల్ల పాక్.. 50 ఓవర్లలో 7 వికెట్లకు 273 పరుగులు చేసింది. ఇప్పుడంటే అది సాధారణమైన స్కోరుగా కనిపించవచ్చు కానీ.. అప్పటికది ప్రమాదకరమే. అందులోనూ వసీమ్ అక్రమ్, వకార్ యూనస్, షోయబ్ అక్తర్, అబ్దుల్ రజాక్‌లతో కూడిన పాక్ పేస్ దళాన్ని ఎదుర్కొని 274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడమంటే సవాలే! ప్రపంచకప్‌లో పాక్‌పై ఓటమి ఎరుగని రికార్డుకు ఈసారి బ్రేక్ పడక తప్పదన్న వ్యాఖ్యానాలు మొదలైపోయాయి. అలాంటి తరుణంలో క్రీజులోకి అడుగు పెట్టారు సచిన్, సెహ్వాగ్. తొలి బంతికి పరుగు రాలేదు. రెండో బంతీ డాట్‌యే. మూడో బంతినీ కష్టంగానే వేశాడు అక్రమ్. కానీ సచిన్ చూడముచ్చటైన కవర్ డ్రైవ్‌తో వారెవా అనిపించాడు. తొలి ఓవర్లో 9 పరుగులొచ్చాయి. మంచి ఆరంభమే!
కానీ రెండో ఓవర్ వేయబోయేది షోయబ్ అక్తర్. అతడి వేగం గురించి చెప్పాల్సిన పని లేదు. తొలి మూడు బంతులు సెహ్వాగ్ ఎదుర్కొన్నాడు. నాలుగో బంతికి సచిన్ స్ట్రైకింగ్‌కు వచ్చాడు. 145 కి.మీ. వేగంతో షార్ట్ లెంగ్త్‌తో బౌన్స్ చేసిన బంతి ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తోంది. చురుగ్గా కదిలిన సచిన్ దాన్ని అందుకున్నాడు. బంతి వేగాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ బ్యాట్ స్వీట్ స్పాట్‌లో అలా తాకించాడంతే! ఎవ్వరూ ఊహించని విధంగా బంతి వెళ్లి బౌండరీ అవతల పడింది. ఇలాంటి బంతులకు ఎడ్జ్ తీసుకుని క్యాచ్‌లు లేవడం చూశాం. లేదా స్వేర్ కట్ బౌండరీ కొట్టడం చూశాం. కానీ ఈ షాట్ ఊహించనిది.
అప్పర్‌కట్‌గా తర్వాత ప్రసిద్ధి పొందిన ఈ షాట్‌ను అంతకుముందు కొందరు ఆడి ఉండొచ్చు కానీ.. దానికి ఆదరణ తెచ్చింది, అందరి కంటే అందంగా ఆడింది మాత్రం సచినే. ఆ షాట్‌తో షోయబ్‌కు నోట మాట రాలేదు. తర్వాతి బంతిని సచిన్ తనదైన శైలిలో లెగ్ ఫ్లిక్ చేసి బౌండరీ సాధించాడు. చివరి బంతికి స్ట్రెయిట్ డ్రైవ్‌తో ఫోర్ కొట్టాడు. ఒకే ఓవర్లో 18 పరుగులొచ్చాయి. తర్వాత వకార్ యూనస్ బంతినందుకుంటే.. సచిన్ స్ఫూర్తితో సెహ్వాగ్ సైతం ఓ అప్పర్ కట్‌తో సిక్సర్ బాదేశాడు. సచిన్ జోరు కొనసాగిస్తూ బౌండరీలతో హోరెత్తించాడు. 5 ఓవర్లకే స్కోరు 50/0. ఛేదనలో బలమైన పునాది పడింది.
తర్వాతి ఓవర్లో వసీమ్ వరుస బంతుల్లో సెహ్వాగ్, గంగూలీను పెవిలియన్ చేర్చి భారత్‌ను గట్టి దెబ్బ తీశాడు. అయినా సచిన్ ఆగలేదు. దూకుడు కొనసాగించాడు. సచిన్ 32 పరుగులపై ఉండగా రజాక్ ఓ క్లిష్టమైన క్యాచ్ వదిలేయడం వల్ల భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత మాస్టర్‌కు ఎదురే లేదు. మహ్మద్ కైఫ్ (35) సహకారంతో చెలరేగి ఆడాడు. 37 బంతుల్లోనే అర్ధశతకం పూర్తయింది. మామూలుగా సచిన్‌ను ఇబ్బంది పెట్టే రజాక్ పప్పులు ఆ రోజు ఉడకలేదు. స్పిన్నర్ అఫ్రిది బంతుల్నీ అలవోకగా బౌండరీకి తరలించాడు.
కెరీర్లో తొలిసారి..
అయితే అర్ధశతకం తర్వాత తొడ కండరాలు పట్టేయడం వల్ల సచిన్ కొంచెం ఇబ్బంది పెట్టాడు. సెంచరీకి చేరువవుతున్న తరుణంలో మరోసారి సచిన్‌ను నొప్పి వేధించింది. ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. అయినా పరుగు తీయడం కష్టమైంది. దీంతో సెహ్వాగ్ రన్నర్‌గా రావాల్సి వచ్చింది. సచిన్ కెరీర్లో బైరన్నర్ సేవలు ఉపయోగించుకోవడం అదే తొలిసారి. 74 బంతుల్లోనే 98 పరుగులు చేసిన మాస్టర్.. సెంచరీ చేయడం లాంఛనమే అనిపించింది. కానీ వకార్ ఒంటి మీదికి విసిరిన బౌన్సర్‌ను కాచుకోబోయిన మాస్టర్.. పాయింట్‌లో యూనిస్ ఖాన్‌కు దొరికిపోయాడు. పాక్ ఆటగాళ్లలో సంబరాలు.. పెవిలియన్‌కు మాస్టర్! అంతే.. స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం! అప్పటికి భారత్ 134 బంతుల్లో 97 పరుగులు చేయాలి. సచిన్ నాలుగో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అయితే మాస్టర్ కష్టం వృథా కానివ్వకుండా ద్రవిడ్ (46 నాటౌట్), యువరాజ్ (50 నాటౌట్) అజేయ భాగస్వామ్యంతో జట్టుకు ఘనవిజయాన్నందించారు. పాక్‌పై ప్రపంచకప్‌లో అజేయ రికార్డు కొనసాగింది. సచిన్ అంటే సెంచరీలకు పేరు. కానీ సెంచరీ కాకపోయినా నాటి ఇన్నింగ్స్ వన్డే చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఒకటిగా నిలిచింది నాటి ప్రదర్శన.
బ్యాట్స్‌మెన్: సచిన్ తెందుల్కర్
పరుగులు: 98
బంతులు: 75
బౌండరీలు: 12 ఫోర్లు, 1 సిక్సర్
ప్రత్యర్థి: పాకిస్థాన్
ఫలితం: 6 వికెట్లతో భారత్ గెలుపు
సంవత్సరం: 2003
ఇదీ చూడండి... హాగ్ వరల్డ్ ఎలెవన్: కోహ్లీని కాదని బాబర్‌కు చోటు