Azadi Amruth Mahostav Cricket match: ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా.. ఆగస్టు 22న క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు బీసీసీఐకి.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. అగ్రశ్రేణి భారత ఆటగాళ్లు ఒక జట్టుగా విదేశాలకు చెందిన ప్రముఖ ఆటగాళ్లు మరో జట్టుగా మ్యాచ్ నిర్వహించాలని కేంద్రం కోరింది. ఈ మ్యాచ్ నిర్వహణపై బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు తెలిపారు. ఇండియా లెవన్, వరల్డ్ లెవన్ మధ్య ఆగస్టు 22న మ్యాచ్ నిర్వహించాలని.. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ప్రతిపాదన వచ్చిందని బోర్డు వర్గాలు తెలిపాయి.
ఈ మ్యాచ్ కోసం అంతర్జాతీయ ఆటగాళ్లు రావాల్సి ఉందని వెల్లడించాయి. దీనికి చాలా కార్యచరణ ఉంటుందని.. కేంద్రం ప్రతిపాదనపై ఇంకా చర్చ జరుగుతోందని వెల్లడించాయి. కేంద్రం కోరుతున్నసమయంలో ఇంగ్లీష్ దేశవాళీ క్రికెట్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ జరగనుందని గుర్తు చేసింది. భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఎక్కువగా ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ మ్యాచ్ నిర్వహణ సాధ్యమైతే దిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే అవకాశం ఉందని చెప్పాయి.
ఇదీ చూడండి: అఫ్రిది.. ఏంటీ మార్పు.. నువ్వేనా ఇలా చేసింది?