ప్రపంచమంతా ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ సందడే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని ఫుట్‌బాల్ క్రీడలో ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఫిక్సింగ్ కేసులో పలు క్లబ్‌ల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు కోరుతూ ఇటీవల ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది.
పలు భారతీయ ఫుట్‌బాల్ క్లబ్‌లు.. మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. సింగపూర్ మ్యాచ్ ఫిక్సర్ అయిన విల్సన్ రాజ్ పెరుమాల్‌కు ఇందులో ప్రమేయం ఉందని భావిస్తోంది. ఫుట్‌బాల్ క్లబ్‌లు షెల్ సంస్థల ద్వారా ఆ ఫిక్సర్ నుంచి డబ్బు అందుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ క్లబ్‌లతో అనుబంధానమైన విదేశీ ఆటగాళ్లు, విదేశీ సహాయక సిబ్బంది, స్పాన్సర్‌ల గురించి సమాచారం ఇవ్వాలని సీబీఐ కోరింది. విల్సన్ రాజ్ పెరుమాల్.. లివింగ్ 3డీ హోల్డింగ్స్ లిమిటెడ్ ద్వారా భారతీయ క్లబ్‌లలో పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం. 1995లో సింగపూర్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో విల్సన్ రాజ్ జైలు శిక్ష అనుభవించాడు.
దీనికి సంబంధించి అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి షాజీ ప్రభాకరన్ స్పందించారు. మ్యాచ్ ఫిక్సింగ్ పట్ల సమాఖ్య పూర్తి పారదర్శక విధానాన్ని అనుసరిస్తోందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విచారణకు సహకరించాలని అన్ని క్లబ్‌లను ఫెడరేషన్ కోరినట్లు ప్రభాకరన్ తెలిపారు.