Hardik Pandya on Umran Malik: ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి హార్దిక్ పాండ్య నేతృత్వంలోని భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 225/7 భారీ స్కోరు సాధించింది. అయితే ఛేదనలో ఐర్లాండ్ లక్ష్యానికి చేరువగా వచ్చి ఆగింది. ఆరంభంలో భారీగా పరుగులు ఇచ్చిన టీమ్‌ఇండియా బౌలర్లు కీలక సమయంలో రాణించడం వల్ల ఐర్లాండ్ 221/5 స్కోరుకు పరిమితమైంది. దీంతో భారత్ 2-0 తేడాతో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.
ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన సందర్భంలో బంతిని యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌కు ఇవ్వడంపై అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పటికే మూడు ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే తీశాడు. అయితే కీలకమైన చివరి ఓవర్‌లో తొలి మూడు బంతులకు రెండు ఫోర్లు, నో బాల్ ఇచ్చినా.. ఆఖరి మూడు బంతులకు కేవలం మూడు పరుగులే ఇవ్వడం వల్ల భారత్ విజయంతో ఊపిరి పీల్చుకుంది. ఈ క్రమంలో చివరి ఓవర్‌ను ఉమ్రాన్ మాలిక్‌కు ఇవ్వడంపై మ్యాచ్ అనంతరం టీమ్‌ఇండియా సారథి హార్దిక్ వివరణ ఇచ్చాడు.
"ఆరు బంతుల్లో 18 పరుగులు కావాలి. ఆ సమయంలో విజయ సమీకరణాలకు సంబంధించి ఎలాంటి ఒత్తిడి పడకూడదని భావించా. అదే విధంగా ఉమ్రాన్ మాలిక్‌ను ప్రోత్సహించి అతడి చేతికే బంతినిచ్చా. అతడి పేస్ చాలా బాగుంటుంది. అటువంటి పేస్‌ను ఎదుర్కొని 18 పరుగులు చేయడమంటే అంత సులువేం కాదు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ బ్యాటర్లు చాలా మంచి షాట్‌లు ఆడారు. అయితే కీలక సమయంలో ఐర్లాండ్‌ను అడ్డుకోవడంలో భారత్ బౌలర్లు విజయవంతమయ్యారు. దీపక్ హుడా, సంజూ శాంసన్ అద్భుతంగా ఆడారు. అభిమానుల మద్దతు చాలా బాగుంది. దినేశ్ కార్తిక్, సంజూ శాంసన్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ప్రేక్షకులు కేరింతలతో సంతోషాన్ని వెలిబుచ్చారు. నాయకుడిగా తొలి సిరీస్‌ను కైవసం చేసుకోవడం ఎప్పుడూ ప్రత్యేకమే. మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని హార్దిక్ పాండ్య అన్నాడు.
ఇదీ చదవండి: ఉత్కంఠ పోరులో టీమ్‌ఇండియా విజయం.. బెంబేలెత్తించిన ఐర్లాండ్