Brian Lara Sun Risers : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌కు అప్పుడే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కొన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ జట్లలో మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ స్థానంలో జస్టిన్ లాంగర్‌కు బాధ్యతలు అప్పగించగా.. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ కూడా కొత్త కోచ్ కోసం వేట మొదలు పెట్టాయని సమాచారం అందింది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారాకు ఉద్వాసన పలికి అతని స్థానంలో మరొకరిని తీసుకోవాలని ఆరెంజ్ ఆర్మీ యాజమాన్యం అనుకుంటోందట. అంతే కాకుండా తమ కొత్త కోచ్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవంతో పాటు మెరుగైన రికార్డు ఉన్న వాళ్లను నియమించుకునే ఆలోచనలో ఉందట.
2023 సీజన్ ప్రారంభానికి ముందు టామ్ మూడీ నుంచి హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన బ్రియాన్ లారా.. ఆ సీజన్‌లో ఫ్రాంచైజీపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. ఇక ఐపీఎల్ 2022 సీజన్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్, సలహాదారుడిగా బ్రియన్ లారా పని చేశాడు. అయితే లారా ఆధ్వర్యంలో సన్‌రైజర్స్ గత సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడగా.. అందులో కేవలం నాలుగే విజయాలను అందుకుని ఆఖరి స్థానానికి పరిమితమైంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ యాజమాన్యం లారాపై వేటు వేయాలని భావిస్తుందట. కొత్త కోచ్ రేసులో ఆండీ ఫ్లవర్, మరో విదేశీ ఆటగాడు ఉన్నట్లు సమాచారం. అయితే జింబాబ్వే మాజీ ప్లేయర్ ఆండీ ఫ్లవర్‌కు కోచ్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు లఖ్‌నవూ జట్టు ఫ్లవర్‌ను వదులుకున్నాక ఆయన్ను నియమించుకోవడం కోసం సన్‌రైజర్స్‌తో పాటు రాజస్థాన్ జట్టు ఆసక్తి కనబరుస్తున్నాయట.
ఆర్సీబీలోనూ మార్పులు..
2024 ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ కూడా కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఫ్రాంచైజీలో కీలక సభ్యులైన డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్, హెడ్ కోచ్ సంజయ్ బాంగర్‌లను వారి పదవుల నుంచి తప్పించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. బాంగర్, హెస్సన్‌లు గత ఐదు సీజన్లుగా ఆర్సీబీతో అనుబంధం కలిగి ఉన్నారు. భారత మాజీ క్రికెటర్ బాంగర్‌ను ఆర్సీబీ యాజమాన్యం 2022లో హెడ్ కోచ్‌గా నియమించుకున్న విషయం తెలిసిందే.