Wriddhiman Saha Journalist case: టీమ్ఇండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేసిన ఆరోపణలపై విచారణ కమిటీ సమర్పించిన నివేదికను ఏప్రిల్ 23న జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సమీక్షించినట్లు తెలిసింది. స్పోర్ట్స్ జర్నలిస్ట్ బొరియా మజుందార్‌ను దోషిగా తేల్చి, అతడిపై రెండు సంవత్సరాల పాటు నిషేధం విధించినట్లు బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపారు.
"బొరియాను స్టేడియంలోనికి అనుమతించకూడదని అన్ని రాష్ట్ర క్రికెట్ బోర్డులకు ఆదేశాలు జారి చేయనున్నాం. హోం మ్యాచులకు అతడికి మీడియా ఎక్రిడిటేషన్ను ఇవ్వకుండా చర్యలు తీసుకున్నాం. అతడిని బ్లాక్‌లిస్ట్ చేయాలని ఐసీసీకి లేఖ రాశాం. అతనితో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని ప్లేయర్స్‌కు సూచిస్తాం." అని సదరు అధికారి వెల్లడించారు.
ఇంటర్వ్యూ ఇవ్వనందుకు జర్నలిస్ట్ బొరియా మజుందార్ తనను బెదిరించాడని సాహా గత ఫిబ్రవరిలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. అందుకు సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ షాట్లను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. మరోవైపు సాహా.. వాట్సప్ చాట్‌ను తారుమారు చేసి తీసిన స్క్రీన్ షాట్లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడని మజుందార్ ఆరోపించాడు. దీంతో వివాదం మరి కాస్త ముదిరినట్లయింది. అయితే దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపేందుకు.. వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ట్రెజరర్ అరుణ్ ధూమల్, అపెక్స్ కౌన్సిల్ మెంబర్ ప్రభుతేజ్ భాటియాలతో బీసీసీఐ ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ సమర్పించిన దర్యాప్తు నివేదికను తాజా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సమీక్షించి తుది నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చూడండి: IPL 2022: ఆర్సీబీకి ఈ తేదీ అంత ప్రత్యేకమా?