బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ భాగంగా టీమ్‌ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్టు ప్రారంభంకానుంది. అయితే ఈ టోర్నీలో కొంతమంది టీమ్‌ఇండియా ప్లేయర్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అరుదైన క్లబ్‌లో చేరేందుకు టీమ్‌ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అడుగుదూరంలో ఉన్నాడు. అతడు ఒక్క వికెట్‌ను తీసుకుంటే టెస్టుల్లో 450 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. అలా ఈ మైలురాయిని అందుకున్న 9వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గానూ రికార్డు సృష్టిస్తాడు. అనిల్ కుంబ్లే (619) మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 450 వికెట్ల క్లబ్‌లో మురళీధరన్ (800), షేన్ వార్న్ (708), జేమ్స్ అండర్సన్ (675), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (566), మెక్ గ్రాత్ (563), కోట్నీ వాల్ష్ (519), నాథణ్ లైయన్ (460) ఉన్నారు. ఈ సిరీస్‌లో అశ్విన్ మరో ఏడు వికెట్లు పడగొడితే.. హర్భజన్ సింగ్ (95)ని అధిగమించి టెస్టుల్లో ఆసీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలుస్తాడు. అనిల్ కుంబ్లే (111) మొదటి స్థానంలో ఉన్నాడు.
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటివరకు 60 టెస్టులు ఆడి 242 వికెట్లు పడగొట్టాడు. అతడు మరో ఎనిమిది వికెట్లు తీస్తే 250 వికెట్లు పడగొట్టిన బౌలర్ల క్లబ్‌లో చేరుతాడు. ఇప్పటివరకు ఎనమిది మ్యాచ్‌లే ఆడిన స్పిన్నర్ అక్షర్ పటేల్ 47 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అతడు మరో వికెట్లు తీస్తే 50 వికెట్ల క్లబ్‌లో చేరతాడు. ఫాస్ట్‌బౌలర్ మహమ్మద్ సిరాజ్ మరో నాలుగు వికెట్లు పడగొడితే 50 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు.
టీమ్‌ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్ పుజారా అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటివరకు 98 టెస్టులు ఆడిన పుజారా మరో రెండు టెస్టులు ఆడితే 100 టెస్టుల క్లబ్‌లో చేరనున్నాడు. భారత్ తరఫున ఇప్పటివరకు సచిన్, ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, సునీల్ గావస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సౌరభ్ గంగూలీ, ఇషాంత్ శర్మ, విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్, సెహ్వాగ్‌లు ఈ ఘనత సాధించారు.
ఇదీ చూడండి: Border gavaskar trophy: కంగారులను ఢీకొట్టే టీమ్‌ఇండియా వీరులెవరో?