బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ జరుగుతోంది. రెండో రోజు టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. 83.3 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియాకు ఒక్క పరుగు అధిక్యం దక్కింది. కాగా, ఆసీస్ బౌలర్లు విజృంభించడం వల్ల భారత్‌కు కష్టాలు తప్పలేదు. అయితే, భారత ప్లేయర్ అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆఖరు వరకు పోరాడి 115 బంతుల్లో 74 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ(44) పరుగులతో రాణించాడు. రోహిత్(32), అశ్విన్(37), జడేజా(26) పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఇక, ఓపెనర్ కేఎల్ రాహుల్(17) ఆకట్టుకోలేకపోయాడు. ఆసీస్ బౌలర్ల విషయానికొస్తే.. లయోన్(5) వికెట్లు తీసి భారత్‌కు సవాల్ విసిరాడు. మాత్యూ కున్నేమన్, టాడ్ మార్ఫీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. పాట్ కమిన్స్ ఒక వికెట్ తీశాడు.
తొలి వంద పరుగుల భాగస్వామ్యం... ఇకపోతే ఈ సిరీస్‌లో తొలిసారి వంద పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ రెండో మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లు ఈ ఫీట్‌ను అందుకున్నారు. 139 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన మన జట్టును అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లు ఆదుకున్నారు. ఎనిమిదో వికెట్‌కు ఇద్దరు కలిసి 114 రన్స్ జోడించారు. అలా సిరీస్‌లో తొలి వంద పరుగుల భాగస్వామ్యం అందుకున్న జంటగా నిలిచారు.
అంతేకాదు ఈ జంట ఒక అరుదైన రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్‌లో టీమిండియా తరపున ఎనిమిదో స్థానంలో సెంచరీ పరుగుల భాగస్వామ్యం అందుకున్న నాలుగో జంటగా నిలిచింది. ఇకపోతే తొలి టెస్టులో అక్షర్ పటేల్, జడేజాలు వంద పరుగుల భాగస్వామ్యం దగ్గరికి వచ్చి ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఇద్దరు కలిసి ఎనిమిదో వికెట్‌కు 88 పరుగులు చేశారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 263/10 (78.4 ఓవర్లు)
ఇండియా తొలి ఇన్నింగ్స్ : 262/10 (83.3 ఓవర్లు)