దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా భారత్ వేదికగా ఈ ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ (T20 world cup) నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో టోర్నీ నిర్వహణపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తర్జనభర్జన పడుతోంది. అయితే టీ20 ప్రపంచకప్ నిర్వహించే విషయమై ఐసీసీ (ICC)వద్ద బీసీసీఐ నెలరోజుల వ్యవధిని కోరనుందని తెలుస్తోంది. మంగళవారం(జూన్ 1) జరగనున్న ఐసీసీ బోర్డు మీటింగ్‌లో దీన్ని ప్రస్తావించనుందట. నెల రోజుల తర్వాత దేశంలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని టోర్నీ నిర్వహణపై బీసీసీఐ ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.
ఓ ఆంగ్ల మీడియా కథనం ప్రకారం.. మంగళవారం జరగనున్న ఐసీసీ బోర్డు మీటింగ్‌కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వర్చువల్‌గా హాజరుకానున్నారు. ఈ సమావేశంలోనే టీ20 ప్రపంచకప్ నిర్వహణ విషయమై మరో నెల రోజులు వ్యవధి కోరే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత గంగూలీ యూఏఈ వెళ్లనున్నారు. ఐపీఎల్ 2021 (IPL 2021)లో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణ గురించి ఎమరైట్స్ క్రికెట్ బోర్డుతో చర్చించనున్నారు.
కాగా, జులైలో బీసీసీఐ సభ్యులు మరోసారి సమావేశమై.. టీ20 ప్రపంచకప్ నిర్వహణపై తుదినిర్ణయం తీసుకోనున్నారు. అదే నెలలో(జులై 18) ఐసీసీ మీటింగ్‌లో టీ20 ప్రపంచకప్ వేదికను ప్రకటించే అవకాశం ఉంది. అయితే అప్పటికీ దేశంలో కరోనా వైరస్‌పై నియంత్రణ రాకపోతే యూఏఈలోనే టోర్నీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: IPL 2021: ప్రేక్షకులకు అనుమతి.. కానీ!