BCCI Revenue Share In ICC : ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి- బీసీసీఐకి కాసుల పంట పడింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి- ఐసీసీ నుంచి రావాల్సిన షేర్ గణనీయంగా 72 శాతం పెరిగింది. దీంతో ఏడాదికి దాదాపు రూ. 2 వేల కోట్ల (231 మిలియన్ డాలర్లు) దాకా అందుకోనుంది. ఈ కొత్త రెవెన్యూ మోడల్‌కు ఐసీసీ ఆమోదం తెలిపినట్లు.. బీసీసీఐ కార్యదర్శి జై షా రాష్ట్ర క్రికెట్ అసోషియేషన్లతో పంచుకున్నారు.
BCCI ICC Revenue Share : ఈ కొత్త రెవన్యూ మోడల్ ప్రకారం.. ప్రతి ఏడాది ఐసీసీ నుంచి బీసీసీఐకి 38.5 శాతం వాటా దక్కనుంది. 'దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన సమావేశంలో ఈ కొత్త రెవెన్యూ విధానానికి ఐసీసీ ఆమోద ముద్ర వేసింది. బీసీసీఐకి ఇప్పటివరకూ 22.4 శాతం వాటా దక్కేది. అయితే, ఇప్పుడు అది గణనీయంగా 72 శాతం పెరిగి 38.5 శాతానికి చేరింది. ఇది రాష్ట్ర సంఘాలు, బీసీసీఐలోని అందరి కృషి వల్లే సాధ్యమైంది'అని జై షా రాష్ట్ర అసోషియేషన్లకు సమాచారం అందించినట్లు ఓ ఆంగ్ల వెబ్సైట్ పేర్కొంది.
BCCI Revenue Share : ఇటీవల ఇండియన్ బ్రాడ్‌కాస్టర్ డిస్నీ స్టార్ సంస్థతో ఐసీసీ ఒప్పందం కుదుర్చుకోవడం బీసీసీఐకి అనుకూలించింది. ఆ ఒప్పందంలో భాగంగా వచ్చే నాలుగేళ్ల సమయానికి బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను డిస్నీ స్టార్ సొంతం చేసుకుంది. దీని కోసం 3.1 బిలియన్ డాలర్లు చెల్లించనుంది. గతంలోనూ 8 ఏళ్ల కాలానికి 1.9 బిలియన్ డాలర్లు చెల్లించి హక్కులు చెల్లించి సొంతం చేసుకుంది. గతంలో కన్నా ఈసారి బ్రాడ్కాస్టింగ్హక్కులు భారీగా పెరిగాయి. దీంతో ఐసీసీ ఆదాయం గణనీయంగా పెరిగింది. అందులో భాగంగానే బీసీసీఐ వాటా కూడా పెరిగింది.
అంతే కాకుండా ఐసీసీ వ్యూహాత్మక నిధి నుంచి కూడా బీసీసీఐకి నిధులు అందనున్నట్లు జై షా తెలిపారు. భారత్‌లో క్రికెట్ వృద్ధికి ఈ నిధులు ఎంతగానో తోడ్పడతాయని జై షా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, ఈ కొత్త రెవెన్యూ మోడల్ పై మిగతా దేశాల బోర్డులు అసంతృప్తిగా ఉన్నాయి. ఇన్నాళ్లూ ఐసీసీ ఆదాయంలో బీసీసీఐతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బోర్డులకు కూడా సమాన వాటా దక్కేది. అందులో భాగంగా వీటిని బిగ్ త్రీగా పిలిచేవారు. అయితే, ఇప్పుడు అది బిగ్ వన్‌గా మిగిలిపోయింది.
ఈ విషయంపై ఇండియన్ ప్రీమియర్ లీగ్- ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. బీసీసీఐ కార్యదర్శి జై షా నాయకత్వంలోని బీసీసీఐ దూరదృష్టి గల బోర్డుగా ప్రపంచవ్యాప్తంగా తన స్థాయిని పెంచుకుందన్నారు. అది మహిళల ప్రీమియర్ లీగ్- డబ్ల్యూపీఎల్, మహిళలకు సమాంతర వేతనాలు చెల్లింపుల్లో అయినా.. ఐపీఎల్ ద్వారా క్రికెట్‌ను విస్తరించడంలో అయినా బీసీసీఐ ఓ ఉదాహరణగా నిలిచిందని చెప్పారు.