BCCI Officer On Virat And Rohit T20 Career : బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా పదవి నుంచి వైదొలగాక చేతన్ శర్మ స్థానంలో వచ్చే కొత్త సెలక్టరే టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20 మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీల క్రికెట్ భవితవ్యాన్ని నిర్ణయించనున్నారని భారత క్రికెట్ బోర్డులోని ఓ అధికారి తెలిపారు. వీరితో పాటు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సహా ఇతర సీనియర్ ఆటగాళ్ల క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన విషయంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారని ఆయన ఓ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు వెల్లడించారు.
"క్రికెట్‌కు సంబంధించి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి జట్టులో ఉన్న ఆటగాళ్లతో చీఫ్ సెలక్టర్ చర్చించవచ్చు. అది వారి బాధ్యత కూడా. ఇందుకు ఎవరు మినాహాయింపు కాదు. ఆటగాళ్లు వయసులో పైబడినా వారి ఇష్టప్రకారం జట్టులో సుదీర్ఘ కాలం పాటు కొనసాగొచ్చు. అయితే ఎంత మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లైనా సరే సమయం వచ్చినప్పుడు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాల్సిందే."
- బీసీసీఐ అధికారి
Rohit Sharma And Virat Kohli T20 Career : ఇప్పుడు కోహ్లీ వయసు 34 ఏళ్లు, కెప్టెన్ రోహిత్ శర్మ వయసు 36 ఏళ్ల.. వయసు దృష్ట్యా వీరిద్దరి టీ20 ఫార్మాట్ భవితవ్యంపై కొత్త సెలెక్టర్ ఏం నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా.. 2021లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఓటమి పాలైన తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఓ స్టార్ ఆటగాడిగా టీమ్‌లో కొనసాగుతున్నాడు.
ఆసియా కప్ 2022లో అఫ్గానిస్థాన్‌పై సెంచరీతో అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ. అదే సంవత్సరం ఆసీస్ గడ్డపై జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లోనూ తన దూకుడును ప్రదర్శించి సత్తా చాటాడు. తాజాగా జరిగిన ఐపీఎల్‌లోనూ అదే జోరును కొనసాగించాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఆశించినంత స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాడు.
BCCI New Chief Selector : బీసీసీఐ లోపల జరిగిన పలు అంతర్గత విషయాలను బహిర్గతం చేసినందున చేతన్ శర్మ స్థానంలో కొత్త చీఫ్ సెలక్టర్‌ను నియమించేందుకు ఇప్పటికే దరఖాస్తులు కూడా ఆహ్వానించారు అధికారులు. ఈ పదవి కోసం టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే దిల్లీ క్యాపిటల్స్ తరఫున అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న అజిత్.. రాజీనామాను కూడా సమర్పించారు. దీంతో ఆయనకే చీఫ్ సెలక్టర్ బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి.