ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో భాగమై నిషేధం ఎదుర్కొంటున్న స్పిన్నర్ అంకిత్ చవన్(Ankeet Chavan) మైదానంలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం చేసింది బీసీసీఐ(BCCI). కోర్టు మార్గనిర్దేశాల ప్రకారం ఇతడి జీవితకాల శిక్షను ఏడేళ్లకు కుదిస్తున్నట్లు తెలిపారు బోర్డు సీఈఓ హేమంగ్ అమిన్. ఈ ఏడేళ్ల నిషేధం గతేడాది సెప్టెంబర్‌తోనే ముగిసింది. దీంతో అంకిత్ కాంపిటేటివ్ క్రికెట్ అడేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. ఈ విషయంపై స్పందించిన అంకిత్.. బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు.
"నేనెంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. మైదానంలో అడుగుపెట్టేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ఈ విషయంలో సహాయం చేసినందుకు బీసీసీఐ, ముంబయి క్రికెట్ అసోషియేషన్‌కు కృతజ్ఞతలు. నిషేధం తొలగించగానే మైదానంలోకి వెళ్లి ప్రాక్టీస్ చేస్తా. ముంబయి జట్టుకు సెలక్ట్ అయినా కాకపోయినా నా పట్టుదలను మాత్రం కొనసాగిస్తా. మిగతాది భవిష్యత్ నిర్ణయిస్తుంది."
-అంకిత్ చవన్, స్పిన్నర్
ఐపీఎల్-2013 సీజన్లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో పేసర్ శ్రీశాంత్, అజిత్ చండిలాతో పాటు శిక్ష అనుభవిస్తున్నాడు అంకిత్. కేసులో వీరి ముగ్గురిపై జీవితకాలం క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది బీసీసీఐ. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవలే శ్రీశాంత్ శిక్షను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది బోర్డు. దీంతో కేరళ తరఫున దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టాడీ పేసర్. ఐపీఎల్ వేలంలోనూ చోటు దక్కించుకున్నా.. ఎవరూ ఇతడిని తీసుకునేందుకు ముందుకు రాలేదు.