India Tour Of South Africa 2023 : టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి- బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. అక్టోబర్‌లో ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ 2023 ముగిశాక.. డిసెంబర్ 10 నుంచి ఈ పర్యటన మొదలు కానుంది. ఈ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికాతో మూడు ఫార్మాట్లలో భారత జట్టు సిరీస్‌లు ఆడనుంది. మొదట 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆ తర్వాత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, ఆఖర్లో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగనుంది. ఈ పర్యటన 2024 జనవరి 7న ముగియనుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగే 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు గాంధీ-మండేలా ఫ్రీడమ్ సిరీస్‌గా నామకరణం చేశారు.
దక్షిణాఫ్రికాలో టీమ్ఇండియా పర్యటన 2023 | ||
తేదీ | మ్యాచ్ | వేదిక |
డిసెంబర్ 10 | తొలి టీ20 | డర్బన్ |
డిసెంబర్ 12 | రెండో టీ20 | గ్వేబెర్హా |
డిసెంబర్ 14 | మూడో టీ20 | జోహనెస్‌బర్గ్ |
డిసెంబర్ 17 | తొలి వన్డే | జోహనెస్‌బర్గ్ |
డిసెంబర్ 19 | రెండో వన్డే | గ్వేబెర్హా |
డిసెంబర్ 21 | మూడో వన్డే | పార్ల్ |
డిసెంబర్ 26 నుంచి 30 వరకు | తొలి టెస్ట్ | సెంచూరియన్ |
2024 జనవరి 3 నుంచి 7 వరకు | రెండో టెస్ట్ | కేప్‌టౌన్ |
మహానుభావులకు ఇది గౌరవ సూచిక : జై షా
ఈ మ్యాచ్‌లు కేవలం రెండు బలమైన జట్ల మధ్య జరిగే పోరు మాత్రమే కాదని.. ఇరు దేశాలకు చెందిన మహానాయకుల గౌరవ సూచికలని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ, దక్షిణాఫ్రికా గాంధీ, నెల్సన్ మండేలాలను తలచుకునేందుకు ఈ మ్యాచ్‌లు వేదికలవుతాయని చెప్పారు. బాక్సింగ్ డే రోజున ప్రారంభమయ్యే తొలి టెస్టు, నూతన సంవత్సరం ప్రారంభంలో మొదలయ్యే రెండో టెస్టు క్రికెట్ క్యాలెండర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయన్నారు. దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు ఎల్లప్పుడూ బలమైన మద్దతు లభిస్తోందని, ఇప్పుడు కూడా రెట్టించిన ఉత్సాహంతో పోటీలను నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
చాలా సంతోషంగా ఉంది : లాసన్
భారత జట్టు, అక్కడి నుంచి వస్తున్న క్రికెట్ అభిమానుల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ ఛైర్‌పర్సన్ లాసన్ నైడో అన్నారు. రెండు టీమ్‌లకు ఈ పర్యటన ఎంతో ముఖ్యమని.. మూడు ఫార్మాట్లలో మ్యాచ్‌లు నిర్వహిస్తుండటం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఇరుజట్లు అసాధారణంగా రాణిస్తున్నాయని, మరిన్ని ఉత్కంఠభరిత మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. అత్యుత్తమ ప్రదర్శనలకు వేదికలవ్వాలనే ఉద్దేశంతో ఈ పర్యటనలోని మ్యాచ్‌లను కేవలం కొన్ని స్టేడియంలకు పరిమితం చేయకుండా.. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు. బీసీసీఐతో మంచి అనుబంధముందని, భవిష్యత్‌లో ఇది మరింత దృఢపడాలని ఆశిస్తున్నానని చెప్పారు.