Duplessis: వచ్చే ఏడాది జనవరిలో ఆరంభం కానున్న దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనే ఫ్రాంఛైజీలు తమకు ఆడే దిగ్గజ ఆటగాళ్ల పేర్లను వెల్లడిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన జొహానెస్‌బర్గ్ ఫ్రాంఛైజీ తరఫున డుప్లెసిస్ ఆడబోతున్నట్లు సమాచారం. ఐపీఎల్‌లో గత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ప్రాతినిధ్యం వహించిన డుప్లెసిస్.. 2011-21 సీజన్లలో చెన్నై తరఫున బరిలో దిగాడు. ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీని కూడా దక్కించుకునేందుకు ఈ జట్టు ప్రయత్నిస్తోంది.
ఈ లీగ్‌లో బరిలో దిగే ముంబయి ఇండియన్స్ కేప్‌టౌన్ జట్టు అయిదుగురు స్టార్ల పేర్లను వెల్లడించింది. వీరిలో రషీద్‌ఖాన్, లివింగ్‌స్టోన్, సామ్ కరన్, రబాడ, బ్రెవిస్ ఉన్నారు. "బలమైన మంబయి ఇండియన్స్ కేప్‌టౌన్ జట్టును నిర్మించాలనే ఆలోచనతో ఈ అయిదుగురు స్టార్లతో ఒప్పందం చేసుకున్నాం. రషీద్, రబాడ, లివింగ్‌స్టోన్, సామ్ కరన్‌తో పాటు ముంబయి ఇండియన్స్ సభ్యుడు బ్రెవిస్‌కు అభినందనలు" అని జట్టు యజమాని ఆకాశ్ అంబానీ చెప్పాడు.
6 జట్లు.. 30 మంది స్టార్లు.. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో పోటీపడుతున్న ఆరు జట్లను భారత ఐపీఎల్ ఫ్రాంఛైజీలు చెన్నైతో పాటు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ దక్కించుకున్నాయి. ముంబయి ఇండియన్స్ కేప్‌టౌన్‌కు ముంబయి ఇండియన్స్.. డర్బన్‌కు లఖ్‌నవూ, పోర్ట్ ఎలిజిబెత్‌కు సన్‌రైజర్స్, పార్ల్‌కు రాజస్థాన్, ప్రిటోరియాకు దిల్లీ యజమానులుగా ఉన్నాయి. ప్రతి జట్టులో 17 మంది ఆటగాళ్లు ఉంటారని.. ఇప్పటిదాకా 30 మందికి పైగా స్టార్ క్రికెటర్లను గుర్తించినట్లు.. వారిలో ఫ్రాంఛైజీలు ఇప్పటికే ఒప్పందం చేసుకుంటున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తాజాగా వెల్లడించింది. నిబంధనల ప్రకారం ఈ లీగ్‌లో పాల్గొనే ప్రతి జట్టు వేలానికి ముందు కనీసం అయిదుగురు ఆటగాళ్లతో ఒప్పందం చేసుకోవాలి. వీరిలో ముగ్గురు విదేశీయులు, ఒక దక్షిణాఫ్రికా అంతర్జాతీయ ఆటగాడు, సఫారీ జట్టుకు ప్రాతినిధ్యం వహించని మరో ఆటగాడు ఉండాలి.
వారికి భారీ మొత్తంలో.. ఈ లీగ్‌లో ఆడటానికి బట్లర్, మోర్గాన్, మొయిన్ అలీ, డుప్లెసిస్, రబాడ, మిల్లర్, జాసన్ హోల్డర్, జేసన్ రాయ్, డికాక్ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశారు. బట్లర్, లివింగ్‌స్టోన్ ఒక్కక్కరికి రూ.3.97 కోట్లు.. మొయిన్‌అలీకి రూ.3.17 కోట్లు, రబాడ, మిల్లర్, మోర్గాన్, డికాక్‌లకు ఒక్కొక్కరికి రూ.2.78 కోట్లు, సామ్ కరన్‌కు రూ.2.38 కోట్లు దక్కబోతున్నాయి. ఈ లీగ్‌లో అందరికంటే ఎక్కువగా ఇంగ్లాండ్ నుంచి 11 మంది బరిలో దిగుతుండగా.. శ్రీలంక నుంచి 10 మంది ఆడనున్నారు.
ఇవీ చదవండి: జింబాబ్వేతో వన్డే సిరీస్.. టీమ్ఇండియాకు కొత్త కెప్టెన్
ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిందెవరో తెలుసా? పాపం పాక్..!