ప్రతిష్ఠాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా వరుస రెండు మ్యాచుల్లో విజయం సాధించి.. 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. చివరు రెండు మ్యాచులు డ్రా చేసినా.. సిరీస్ మనదే. అయితే వరసు రెండు టెస్టుల్లో ఓటిమిపాలైన ఆస్ట్రేలియా.. స్పిన్ పిచ్‌లపై అక్కసు వెళ్లగక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆసీస్ టెస్ట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అత్యవసరంగా స్వదేశానికి బయలుదేరి వెళ్లాడు. ఈ మేరకు ఆసీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వ్యక్తిగత కారణాల నిమిత్తం వెళ్లాల్సి వచ్చిందని పేర్కొంది.
"కుటుంబ కారణాల వల్ల ప్యాట్ అత్యవసరంగా సిడ్నీ వెళ్లాడు. వారాంతంలో తిరిగి భారత్‌కు చేరుకొనే అవకాశం ఉంది. ఇందౌర్ వేదికగా మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టుకు ముందే సన్నాహక శిబిరంతో చేరిపోతాడు. దయచేసి అతడి ప్రైవసీకి భంగం కలిగించవద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం" అని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన విడుదల చేసింది.
తొలి రెండు టెస్టుల్లో భారత్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న ఆసీస్.. మిగతా రెండు టెస్టుల్లోనూ విజయం సాధిస్తేనే కనీసం సిరీస్ సమమవుతుంది. కనీసం ఒక్కటి గెలిచినా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్లేందుకు అర్హత సాధిస్తుంది.