టీమ్ఇండియాతో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. గాయాల కారణంగా ముగ్గురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. కాగా,రోహిత్ సేనతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు కంగారూ జట్టు భారత పర్యటనకు రానుంది. ఇందులో భాగంగానే సెప్టెంబరు 20న ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే ఈ జట్టులో చోటు దక్కించుకున్న మిచెల్ మార్ష్, మార్కస్ స్టొయినిస్, మిచెల్ స్టార్క్‌ను గాయాల బెడద వేధిస్తోంది. స్టార్క్ ఇప్పుడిప్పుడే మోకాలి నొప్పి నుంచి కోలుకుంటుండగా.. మార్ష్ పాదానికి గాయమైంది. ఇక స్టొయినిస్ పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురిని పక్కనపెట్టి.. వీరి స్థానాల్లో ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎలిస్, ఆల్‌రౌండర్లు డేనియల్ సామ్స్, సీన్ అబాట్‌లతో భర్తీ చేసింది. నిజానికి గాయాలు చిన్నవే కానీ.. మరో నెల రోజుల్లో టీ20 ప్రపంచకప్ ఉండటంతో ఎటువంటి రిస్క్ తీసుకోకుండా వారికి విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సిరీస్‌కు డేవిడ్ వార్నర్‌కు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో కామెరూన్ గ్రీన్ ఆడనున్నాడు. అయితే గాయాల బారిన పడిన స్టార్క్, స్టొయినిస్, మార్ష్‌ప్రపంచకప్ ఆరంభం నాటికి వీరు ఫిట్‌నెస్ సాధిస్తే ఆడే అవకాశం ఉంది.
కొత్త జెర్సీ.. ఈ ప్రకటనతో పాటే తాజాగా డిజైన్ చేయించిన తమ కొత్త జెర్సీని ఆసీస్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది. "టీ20 ప్రపంచకప్‌లో మా ఆటగాళ్లు కొత్త జెర్సీని ధరిస్తారు" అని క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. కాగా, అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పెద్ద జట్లన్నీ తమ ఆటగాళ్లతో కూడిన స్వ్కాడ్‌ను ప్రకటించాయి. భారత్ కూడా 15 మందితో కూడిన ప్రధాన జట్టును.. నలుగురు స్టాండ్‌బై ఆటగాళ్లను ఎంపిక చేసింది.
ఇదీ చూడండి: 4 ఓవర్లలో 2 మెయిడెన్లు.. 3 పరుగులిచ్చి 4 వికెట్లు.. బ్యాటర్లకు చుక్కలే