అంతర్జాతీయ క్రికెటర్లు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా వెటరన్ బ్యాట్స్‌మన్ పీటర్ హాండ్స్‌కాంబ్ (Peter Handscomb)కు కొవిడ్ నిర్ధరణ అయింది. ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్(County Cricket) ఆడుతుండగా అతడికి వైరస్ సోకింది.
ఇప్పటికే ముగ్గురు ఇంగ్లాండ్ క్రికెటర్లతో పాటు నలుగురు సహాయ సిబ్బందికి వైరస్ సోకింది. వీరితో ఆడిన శ్రీలంక క్రికెటర్లు స్వదేశానికి వెళ్లగానే క్వారంటైన్ అయ్యారు. బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, డేటా అనలిస్టు జీటీ నిరోషన్‌కు పాజిటివ్ వచ్చింది. అక్కడే మరో శిబిరంలో ఉన్న వేరే ఆటగాడికి కూడా వైరస్ సోకింది. ప్రస్తుతం అదే ఇంగ్లాండ్‌లో ఆడుతున్న హాండ్స్‌కాబ్‌కు వైరస్ సోకడం ఆందోళనకు గురి చేస్తోంది.
కొన్నాళ్లుగా ఫామ్‌లో లేని హాండ్స్‌కాంబ్ కౌంటీల్లో మిడిలెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆస్ట్రేలియా తరఫునా అతడిని ఎంపిక చేయడం లేదు. 2019, జనవరిలో టీమ్‌ఇండియాతో చివరి టెస్టు ఆడాడు. 2019, ఫిబ్రవరిలో కోహ్లీసేనతో చివరి టీ20 ఆడాడు.
ఇదీ చదవండి: కోహ్లీ తనయ వామిక ఫొటోలు వైరల్.. మీరూ చూసేయండి
అశ్విన్ రికార్డు..
టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ashwin) అరుదైన ఘనత సాధించాడు. 11 ఏళ్ల తర్వాత కౌంటీ క్రికెట్లో తొలి ఓవర్ వేసిన స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. 2010లో జీతన్ పటేల్ ఆరంభ ఓవర్ వేయగా మళ్లీ ఇన్నాళ్లకు అశ్విన్‌కు ఆ అవకాశం వచ్చింది.
ప్రస్తుతం కోహ్లీసేన ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ముగిశాక జట్టు సభ్యులకు మూడు వారాల విరామం ప్రకటించారు. కొన్నిరోజులు కుటుంబంతో కలిసి బ్రిటన్ చుట్టొచ్చిన అశ్విన్‌కు సర్రే నుంచి ఆహ్వానం అందింది. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు మ్యాచ్ ప్రాక్టీస్ దొరుకుతుందని అతడూ అంగీకరించాడు.
ఆదివారం సోమర్‌సెట్, సర్రే మధ్య మ్యాచ్ జరిగింది. పిచ్ మందకొడిగా ఉండటం వల్ల సర్రే సారథి రోరీ బర్న్స్ కొత్త బంతిని మొదట అశ్విన్ చేతికి ఇచ్చాడు. మొత్తంగా అతడు తొలిరోజే 28 ఓవర్లు వేయడం గమనార్హం. 5 ఓవర్లు మెయిడిన్ వేసిన అశ్విన్ 70 పరుగులిచ్చి టామ్ లామన్‌బి (42) వికెట్ పడగొట్టాడు.
ఇదీ చదవండి: ధోనీ కంటే ముందొచ్చారు.. రిటైర్మెంట్ వద్దంటున్నారు!