India vs Pakistan Match Preview: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ రానే వచ్చింది. దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్న ఆసియా కప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ ఆదివారం పోటీపడనున్నాయి. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఓడిన భారత్.. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉంది. అటు ప్రత్యర్థి పాక్ కూడా భారత్‌పై నెగ్గాలని ఉవ్విళ్లూరుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తిక్‌లతో కూడిన భారత బ్యాటింగ్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. అటు.. పాక్ జట్టులోనూ బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్‌లతో కూడిన బ్యాటింగ్ బలంగానే ఉంది. అంతర్జాతీయ టోర్నీలలో పాక్‌పై ఎప్పుడూ భారత్ పైచేయి సాధించడం టీమిండియాకు సానుకూలాంశం.
గాయాలతో ఇరుజట్లలో ప్రధాన పేసర్లు టోర్నీకి దూరం కావడంతో.. రెండు జట్లకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వెన్ను నొప్పి కారణంగా టీమిండియా యార్కర్ కింగ్ జస్పీత్ బుమ్రా.. పక్కటెముకల గాయం కారణంగా హర్షల్ పటేల్ ఆడకపోవడం భారత్‌కు కష్టంగా మారింది. దీంతో పేస్ బౌలింగ్ బాధ్యతలు సీనియర్ పేసర్ భువనేశ్వర్ మోయనున్నాడు. భువీకి తోడుగా అర్ష్‌దీప్ సింగ్‌ను బరిలోకి దించాలని యాజమాన్యం భావిస్తోంది. భారత టాప్ ఆర్డర్ శుభారంభం ఇస్తే.. మిడిలార్డర్ భారీస్కోరు చేయాలని జట్టు యోచిస్తోంది. 10 నుంచి 20 ఓవర్ల మధ్య సూర్యకుమార్, హార్దిక్ చెలరేగితే చివర్లో దినేశ్ కార్తీక్ మెరుపులు మెరిపిస్తే గెలుపు నల్లేరు మీద నడకే అని రోహిత్ సేన భావిస్తోంది.
మరోవైపు, మోకాలి గాయంతో షాహీన్ అఫ్రిదీ దూరం కావడం వల్ల పాక్‌కు గట్టి దెబ్బ తగిలింది. బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తున్న పాకిస్థాన్ బలమైన భారత బ్యాటింగ్ లైనప్‌ను ఎదుర్కొనేందుకు బంతితో ఎలాంటి వ్యూహాలు రచిస్తుందనేది కీలకంగా మారింది. గతేడాది బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్ రాణించడం వల్ల భారత్‌పై 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ గెలవడం ఆ జట్టుకు విజయంపై ఆశలు కల్పిస్తోంది. దుబాయ్ వేదికగా భారత్-పాక్ మధ్య ఆదివారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇవీ చదవండి: కోహ్లీ ఆవేదన, మానసికంగా కుంగిపోయి అప్పటినుంచి బ్యాట్ పట్టలేదంటూ